-ఓటు హక్కును హరించే ప్రయత్నాలను అడ్డుకోవాలి: వక్తల పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల నాటికి ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ దాసరి భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ – కర్తవ్యం’ అంశంపై సదస్సు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ప్రొఫెసర్ కేవీఎన్ రావు, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్. దివాకర్‌బాబు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి వైబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడటంతో పాటు ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, 2029 ఎన్నికల నాటికి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు అని, ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులను అడ్డుకోవాలని కోరారు. ప్రొఫెసర్ కేవీఎన్ రావు, దివాకర్‌బాబు మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల అమలు, న్యాయవ్యవస్థ, పోలీసు సంస్కరణలు అవసరమన్నారు. వైబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల హక్కులు, అధికార వికేంద్రీకరణను పరిరక్షించాలని సూచించారు.
కార్యక్రమానికి సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు స్వాగతం పలకగా, జల్లి విల్సన్, మనోహర్ నాయుడు, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు రాజ్యాంగ పరిరక్షణ గీతాలు ఆలపించారు.
