ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన లేపాక్షి చైర్మన్ హరిప్రసాద్

-తిరుమల లేపాక్షి విక్రయశాల ఆధునికీకరణకు వినతిపత్రం అందజేత

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుమల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుపతిలోని వ్యవసాయ కళాశాల హెలిపాడ్ వద్ద రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన హరిప్రసాద్, తిరుమలలోని లేపాక్షి హస్తకళల విక్రయశాల 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో దాని ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో విక్రయశాలను అభివృద్ధి చేసి, దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఐదు దశాబ్దాలుగా లేపాక్షి సంస్థ రాష్ట్ర సంప్రదాయ హస్తకళలు, కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోందని హరిప్రసాద్ వివరించారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిన తిరుమలలో లేపాక్షి విక్రయశాలను మరింత ఆధునికంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర హస్తకళలకు విస్తృత ప్రచారం లభిస్తుందని తెలిపారు. అలాగే స్థానిక కళాకారులు తయారుచేసే ఉత్పత్తులకు మరిన్ని విక్రయ అవకాశాలు కల్పించవచ్చన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను భక్తులు, పర్యాటకులకు చేరువ చేయడంతో పాటు కళాకారులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర హస్తకళల పరిరక్షణ, కళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళలకు ఆధునిక విక్రయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా లేపాక్షి సంస్థ పనిచేస్తోందని హరిప్రసాద్ తెలిపారు.