-జనవరి 29 నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు ఆహార శుద్ధి పరిశ్రమల ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా నిర్వహించనున్న ఏపీ ఛాంబర్స్ ఫుడ్ప్రోటెక్–2027 ప్రదర్శనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 29న ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి 29 నుంచి 31 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ ప్రదర్శన జరగనుంది.
ఏపీ ఛాంబర్స్ మాజీ అధ్యక్షుడు ముత్తవరపు మురళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించి ప్రారంభించేందుకు అంగీకరించారు.
ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమలు, యంత్ర పరికరాల తయారీ సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నూతన వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. ఆహార శుద్ధి, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. వ్యాపార సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాల కల్పనకు ఈ ప్రదర్శన వేదిక కానుంది.
కొత్త పెట్టుబడుల ప్రకటనలు, పెట్టుబడి ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాల కుదుర్చుకోవడానికి కూడా ఈ ప్రదర్శనను వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
ప్రదర్శనలో నూతన ఆవిష్కరణలు, నూతన వ్యాపార సంస్థలు, ప్యాకేజింగ్, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిష్కారాలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
జనవరి 29న సాయంత్రం 7 గంటలకు ఏపీ ఛాంబర్స్ వ్యాపార ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఎగుమతులు తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలు, పారిశ్రామికవేత్తలను 15 విభాగాల్లో పురస్కారాలతో సత్కరించనున్నారు.
ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త వ్యాపార అవకాశాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే ఈ ప్రదర్శన ప్రధాన లక్ష్యమని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు.
