-యువత భాగస్వామ్యంతో వ్యాధి గుర్తింపు, చికిత్సకు ప్రాధాన్యం
-28 జిల్లాల్లో 679 బ్లాక్‌లలో ‘జోష్’ బృందాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా క్షయవ్యాధి(టీబీ) నిర్మూలనలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న జోష్ (JOSH–Joint Squad for Health) కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్థాయి బృందాల ఏర్పాటు 100 శాతం పూర్తయ్యింది. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో మొత్తం 679 బ్లాక్ స్థాయిల్లో బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ నేడొక ప్రకటనలో తెలిపింది. నవంబరు నెలాఖరులోగా ఈ బృందాలకు శిక్షణ పూర్తి చేసి, క్షేత్ర స్థాయిలో పర్యటించేలా వైద్య,ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దేశవ్యాప్తంగా క్షయ వ్యాధి నిర్మూలన చర్యల్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జోష్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2026 అక్టోబర్ 8న ప్రారంభించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనా కార్యక్రమం (National Tuberculosis Elimination Programme – NTEP) కింద వ్యాధిని ముందుగానే గుర్తించడం, పరీక్షల సదుపాయాలు, వైద్య సేవలు, చికిత్సలు మెరుగుపరచడం, రోగులకు అవసరమైన సాయాన్ని అందించడంపై వైద్య,ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో టీబీ నిర్మూలనను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ‘జోష్ – క్షయరహిత భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టింది.
క్షయవ్యాధి నిర్మూలనలో ‘జోష్’ బృందాల కీలక పాత్ర
జిల్లాల్లోని ప్రతి బ్లాక్ స్థాయిలో ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించే బృందంలో ఐదుగురు మై భారత్ వాలంటీర్లు, ఐదుగురు ఎన్‌సీసీ క్యాడెట్లు ఉన్నారు. క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమాజంలోని ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేయడం, వ్యాధి లక్షణాలున్న వారిని ముందుగానే గుర్తించి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించడం ఈ బృందాల ప్రధాన బాధ్యతలు. నిక్షయ్ మిత్రల భాగస్వామ్యాన్ని పెంచడం, టీబీ బాధితులకు పోషకాహార బుట్టల(పుడ్ బాస్కెట్స్) పంపిణీకి సహకరించడం, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, పరిశుభ్రతను ప్రోత్సహించడం, టీబీ ముక్త్ భారత్ అభియాన్ యాప్ వినియోగం గురించి ప్రజలకు తెలియజేయడం వంటి అవగాహన కార్యక్రమాలను ఈ బృందాలు చేపడతాయి. జోష్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్థాయి బృందాలకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వబోతున్నారు. క్షయవ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణా చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రజల్లో చైతన్యం పెంపొందించేలా శిక్షణ ఇవ్వనున్నారు . బ్లాక్ స్థాయిలో చేపట్టాల్సిన జోష్ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా బృందం, సంబంధిత నోడల్ అధికారి సమన్వయంతో సూక్ష్మ కార్యాచరణ ప్రణాళిక (మైక్రోప్లాన్) రూపొందిస్తారు. సందర్శించాల్సిన ప్రాంతాలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బృందాల వారీగా బాధ్యతలు, గడువులను అందులో స్పష్టంగా పేర్కొంటారు.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పర్యవేక్షణ
జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే టీబీ ముక్త్ భారత్ కమిటీలు జోష్ బృందాల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల్ని అమలు చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తాయి
