Breaking News

భూ వివాద అర్జీలు 10 నుంచి 50 శాతానికి పెరిగాయి

-ఒక్క‌సారిగా ఇలా పెరిగాయంటే గ‌త ఐదేళ్ల‌లో ఏదో త‌ప్పు జ‌రిగింది
-ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార‌మే క‌లెక్ట‌ర్ల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం
-రెవెన్యూ కార్యాల‌యాల భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టండి
-స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచీ వ‌చ్చే అర్జీల్లో గ‌తంలో కేవ‌లం 10 శాతం మాత్ర‌మే భూ వివాదాల‌కు సంబంధించి ఉండేవ‌ని, అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ అర్జీలు 50 శాతంపైగా పెరిగాయ‌ని, అంటే గ‌త ఐదేళ్ల‌లో ఏదో జ‌రిగింద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వానికి అందుతున్న ఈ భూ వివాదాల అర్జీల ప‌రిష్కారానికి క‌లెక్ట‌ర్లంద‌రూ మొద‌టి ప్రాధాన్య‌మివ్వాల‌ని కోరారు. గ‌త ఐదేళ్ల లో త‌మ భూమిని క‌బ్జా చేశార‌ని దౌర్జ‌న్యంగా ఆక్ర‌మించుకున్నార‌నే ఫిర్యాదులు ప్ర‌భుత్వానికి కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ స్థాయిలో భూ వివాద సంబంధిత ఫిర్యాదులు, అర్జీలు వ‌చ్చేవి కావ‌ని తెలిపారు. అంటే గ‌త ఐదేళ్ల‌లో ఏదో త‌ప్పు జ‌రిగింద‌నే అభిప్రాయం ఇది క‌లిగిస్తోంద‌ని, ఇప్పుడు ఆ ఫిర్యాదుల‌న్నీ ప‌రిష్క‌రించాల్సిన బాధ‌త్య మ‌న‌పైన ఉంద‌న్నారు. చాలా చోట్ల అసైన్డ్ భూములు, ఇనామ్ భూముల విష‌యంలో అక్ర‌మాలు జ‌రిగాయి, చాలా చోట్ల డి ప‌ట్టాల‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చేశార‌ని వీట‌న్నిటిపైనా విచార‌ణ జ‌రిపి రికార్డులు పునః ప‌రిశీలించాల‌న్నారు. తిరుప‌తి, చిత్తూరు, వైయ‌స్సార్ క‌డ‌ప‌, అన్న‌మ‌య్య‌, ప్ర‌కాశం, స‌త్య‌సాయి జిల్లాల్లో ఇలాంటి వివాదాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, ఈ జిల్లాల్లో భూ వివాదాలు ప‌రిష్క‌రించ‌డానికి డిప్యూటీ క‌లెక్ట‌ర్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ప‌రిష్క‌రించాల‌న్నారు. ముందుగా ఈ జిల్లాల్లో ఒక మండ‌లాన్ని ఎంపిక చేసుకుని ఈ క‌మిటీ అక్క‌డ రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి ఈ ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించాల‌ని, నెల రోజుల్లోపు ఇది పూర్తీ కావాల‌ని ఆదేశించారు.

అర్జీల‌పై ఉదాసీన‌త వ‌ద్దు
జిల్లా క‌లెక్ట‌ర్ల‌పైన ఎంతో న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు అర్జీలు ఇవ్వ‌డానికి వ‌స్తార‌ని, వాటి ప‌రిష్కార‌మే త‌మ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాల‌ని కోరారు. జిల్లా క‌లెక్ట‌ర్లే ప్ర‌భుత్వ ప‌నితీరుకు ప్ర‌తీక‌గా నిలుస్తార‌ని చెప్పారు. ప్ర‌జ‌లిచ్చే ఫిర్యాదులు ప‌రిష్క‌రించ‌కుండా ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శిస్తే వారిలో ప్ర‌భుత్వం ప‌ట్ల న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుంద‌న్నారు. వ‌చ్చిన ఫిర్యాదులు ప‌రిష్క‌రించ‌న‌ప్పుడే ప్ర‌జ‌లు స‌చివాల‌యానికి, ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రుల చుట్టూ త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంటార‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగించాల‌న్నారు. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం అగ్ని ప్ర‌మాద సంఘ‌ట‌న రెవెన్యూ కార్యాల‌యాల వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌ను తెలియ‌జేసింద‌న్నారు. అక్క‌డ 56 సంవ‌త్స‌రాల వీఆర్ ఏను రాత్రి పూట కాప‌లా ఉంచార‌ని, అలాగే సీసీ కెమ‌రాలు కూడా ప‌నిచేయ‌లేద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాల‌యాలు, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల వ‌ద్ద ప‌టిష్ఠ భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌న్నారు. శాశ్వ‌త కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీ చేసే దిశ‌గా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *