Breaking News

విజయవాడ కలెక్టరేట్ కేంద్రంగా 10 రోజులు నిర్విరామంగా సహాయ, పునరావాస చర్యలు

-వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం సుడిగాలి పర్యటనలు.. ఏరియల్ సర్వే, బోట్లు, జేసీబీల్లో, కాలినడకన పర్యటన.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా..
-9 రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి
-సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలు.. డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా
-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఫుడ్ స్టాక్ పాయింట్ గా బాధితులకు నిత్యావసరాల సరఫరా
-హుద్ హుద్ సమయంలో అనుసరించిన ఉత్తమ విధానాలతో బాధితులకు సత్వర సాయం
-సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 32 డివిజ‌న్లకు 32 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు, 179 స‌చివాల‌యాల‌కు 179 మంది ఇన్‌ఛార్జ్‌ల‌ నియామకం.. బాధితులకు అండగా నిలవడంలో సఫలీకృతం
-బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు.. బాధితులకు సాయం అందించే దిశగా చర్యలు
-వరదల్లో మునిగిన వాహనాలు, పలు ఎలక్ట్రానిక్ తదితర గృహోపకరణాల మరమ్మతుల కోసం అర్బన్ యాప్ కంపెనీ సహకారం
-వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం
-ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల యజమానులపై చర్యలు.. దెబ్బతిన్న గేట్ల స్థానంలో కొత్తగా కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పూర్తి
-వరద నష్టంపై రూ. 6,880 కోట్లతో కేంద్రానికి ప్రాథమిక నివేదిక
-సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చేందుకు ముందుకొచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 10 రోజులు పాటు సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేసి, నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టి లక్షలాది మంది ప్రజలను భారీ విపత్తు నుండి కాపాడారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 37 సెం.మీల అసాధారణ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఓర్వకల్లులో పెన్షన్ల పంపిణీ పర్యటన రద్దు చేసుకొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని 24/7 మంత్రులు, సిఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సహాయ, పునరావాస చర్యలపై దిశానిర్ధేశం చేశారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ కు 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడం, బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరంలోని 32 వార్డుల్లో పలు కాలనీలు నీట మునగడం బాధ కలిగించే విషయమే. కానీ సంక్షోభాన్ని సవాలుగా తీసుకొని సీఎం సమస్యకు పరిష్కారం చూపారు.. 9 రోజుల్లోనే విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 32 డివిజ‌న్లకు 32 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు, 179 స‌చివాల‌యాల‌కు 179 మంది ఇన్‌ఛార్జ్‌ల‌ను నియ‌మించి బాధితులకు అండగా నిలిచారు.

74 ఏళ్ల వయసును లెక్క చేయకుండా స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు, జేసీబీల్లోనూ, కాలినడకన బురదలో పర్యటించి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్న సంకేతం పంపించారు. 2014లో విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో అనుసరించిన ఉత్తమ విధానాలను అవలంభించి ఎప్పటికప్పుడు బాధిత ప్రజలతో స్వయంగా సమస్యలు తెలుసుకొని ఆ దిశగా పరిష్కారం చూపి బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు.10 రోజుల పాటు నిరంతరాయంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలందరికీ అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వాటర్ బాటిళ్లు, పాల ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు వంటివి మూడు పూటల పంపిణీ చేశారు.

30 ఆగస్టున ప్రారంభమైన భారీ వర్షాలు, వరదలపై వెంటనే అప్రమత్తమైన సీఎం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని పూర్తి సన్నద్ధం చేసి ప్రజలకు తగు సూచనలు చేస్తూ, అవసరమైన సహాయక చర్యలను చేపట్టి ప్రజలకు భరోసా కల్పించారు. పొంగే నదులు, వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడారు. భారీ వర్షాలు పడే ప్రాంతాలకు విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ప్రజల ఫోన్ లకు మెసేజ్ అలెర్ట్ పంపించి అప్రమత్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన తక్షణ ముందస్తు చర్యలవల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని కనిష్టస్థాయికి నివారించగలిగారు.
దురదృష్టవశాత్తు 31 మంది చనిపోయినప్పటికీ ఆయా కుటుంబాలకు త్వరితగతిన రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి అండగా నిలిచారు. సహాయ పునరావాస చర్యల నిమిత్తం జిల్లాకు రూ.3 కోట్లు విడుదలకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయి.

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లోని కొల్లేరు వరకు సీఎం హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు, కొల్లేరు, ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో కృష్ణా నదీ లంక గ్రామాలను ఏరియల్ సర్వే చేసి సమస్య పునరావృతం కాకుండా వరద సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం శుభ పరిణామం.

ప్రధాని నరేంద్ర మోదీతో హామీ ద్వారా రాష్ట్రానికి సాయం అందుతుందన్న భరోసాను బాధితుల్లో కల్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి పదుల సంఖ్యలో పవర్ బోట్లు, డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బందిని రప్పించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా అగ్నిమాపక వాహనాలను రప్పించి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలు చేపట్టి బాధితుల పక్షాన నిలిచారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వరద ప్రాంతాలను సందర్శించి ముఖ్యమంత్రి నేతృత్వంలో అధికార యంత్రాంగం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బృందం కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించింది. ఈ నేపథ్యంలో వరద నష్టంపై కేంద్రానికి రూ. 6,880 కోట్లతో ప్రాథమిక నివేదిక పంపించింది రాష్ట్ర ప్రభుత్వం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా బాధిత ప్రజలకు ఆహార పొట్లాలు, బిస్కట్లు, వాటర్ బాటిళ్లు, పాలు, మెడికల్ కిట్లు తదితర వస్తువులను సీఎం సరఫరా చేయించారు.. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో చక్కెర, లీటర్ పామాయిల్, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు అందించాలని ఆదేశాలు జారీ చేసి ఉపశమన చర్యలు చేపట్టారు. కూర‌గాయ‌ల‌ ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకొని రూ.2, రూ.5, రూ. 10 కే బాధితులకు కూరగాయలు అందించారు. వరదల సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేలా 5 లక్షల కరపత్రాల పంపిణీ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.

ఫుడ్ స్టాక్ పాయింట్ గా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను వేదికగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి కలెక్టర్లు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన ఆహారం, ఇతర వస్తువులను చిట్ట చివరి ప్రాంతంలోని చివరి వ్యక్తి వరకు సాయం అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు.

వరదలు, భారీ వర్షాల వల్ల గృహాల్లో దెబ్బతిన్న వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను, ఇతర గృహోపకరణాలను మరమ్మత్తు చేసేందుకు అర్బన్ యాప్ కంపెనీ సహాయంతో చర్యలు ప్రారంభించింది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని గిగ్ ఎకానమీ మరియు గ్రామస్థాయి టెక్నాలజీ బృందంతో కొత్తగా డిజిటల్ ఎంపవర్ మెంట్ సాధించాలని సీఎం వినూత్నంగా ఆలోచించి విజయవాడలో శ్రీకారం చుట్టాలని భావించారు.

డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నష్టం వివరాలను అంచనా వేయడం, నిఘా ఉంచడం, ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి పూడ్చడం, బాధితులకు ఆహారం సరఫరా చేయడం, ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం, నష్టపోయిన వివరాలకు సంబంధించిన ఫోటోతో కూడిన ఆధారాలు బీమా సంస్థకు అందించేందుకు డ్రోన్లు వినియోగించారు. 40 కిలోల బరువును మోయగల డ్రోన్ లను తీసుకువచ్చి నిత్యావసర సరుకులు సైతం పంపిణీ చేయడం విశేషం.

ఇతర జిల్లాల నుండి వచ్చే ఫుడ్ స్టాక్ ను ఎక్కడ స్వీకరించాలి? ఎక్కడెక్కడికి పంపించాలి? ఏ ఏ ప్రాంతాల్లో వాటి అవసరం ఉంది? ఇంటింటికి ఎలా పంపించాలి వంటి అంశాలన్నీ రియల్ టైమ్ లో ఆన్‌లైన్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ బాధిత ప్రజలకు అందించారు. ఐవీఆర్ఎస్ ద్వారా బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ప్రతిరోజూ ప్రజాభిప్రాయం స్వీకరించి సంతృప్తి స్థాయిని తెలుసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చి నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షించారు.

వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇవ్వాలని కోరారు. ప్రజలు కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐ విషయంలో బ్యాంకర్ల నుంచి ఒత్తిడి చేయకుండా ఆపగలిగారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేసేలా సూచించారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు, నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయిన వారికి భరోసా కల్పించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్ ను కలిసి వరద పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించడాన్ని గవర్నర్ సైతం మెచ్చుకోవడం విశేషం. భారీ వర్షాలు, బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చి బుడమేరు స‌మ‌స్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీఎం చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చర్యలను చెన్నై, సికింద్రాబాద్ నుండి వచ్చిన ఆర్మీ ఇంజ‌నీరింగ్ విభాగం సైతం ప్రశంసించేలా శ్రమించారు.

ప్రకాశం బ్యారేజీని అనుమానాస్పదంగా 5 పడవలు వెళ్లి బలంగా ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు విరిగాయి. అప్రమత్తమైన ప్రభుత్వం జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్యనాయుడును రప్పించి 15 రోజుల్లో పూర్తవుతుందనుకున్న కౌంటర్ వెయిట్లు ఏర్పాటు ప్రక్రియను కేవలం వారం లోపే చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా బోటు ఘటనను సీరియస్ గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించి అనుమానితులను అరెస్ట్ చేసింది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు ఒక నెల వాయిదాకు ఆదేశించారు. అదే విధంగా నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందించేలా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించి ప్రజలను ఆదుకునేందుకు సీఎం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటునిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలతో సహా ఎన్ ఆర్ఐలు, రాజకీయ, వాణిజ్య, వ్యాపార, స్వచ్ఛంధ సంస్థలు, సినీ ప్రముఖులు, పలు కంపెనీలు, ఉద్యోగ సంఘాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టు సంఘాలు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు, ఇతర దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దాతలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వరద సహాయక చర్యల్లో పాలుపంచుకున్న రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర అధికార యంత్రాంగానికి, కేంద్ర సిబ్బంది, ఆర్మీకి, రాష్ట్ర ప్రజలకు, మీడియా సిబ్బందికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *