Breaking News

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించం…


-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటి స్వాదీనానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉర్దూ అకాడమీ అధికారులు, క్రిష్టియన్ ఫైనాన్సు కార్పొరేషన్ అధికారులతో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు పథకాల అమలు తీరును సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు 35 శాతం వక్ఫ్ ఆస్తులు కేవలం కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని, అయితే ఆ జిల్లాలోనే వక్ఫ్ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వక్ఫ్ భూములు అక్రమణకు గురయ్యాయని, వాటన్నింటినీ సాద్యమైనంత త్వరగా స్వాదీనపర్చుకొనేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోనున్న ప్రధాన వక్ఫ్ భూములను గుర్తించి, వాటి పరిరక్షణకై ప్రహరీ గోడల నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవిన్యూ అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాలని, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో వర్కు ఇన్ స్పెక్టర్లే కాకుండా జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు కూడా కీలక భూమిక పోషించాలని మంత్రి ఆదేశించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన వ్యవసాయ భూములను బహిరంగ వేలం ద్వారానే లీజుకు ఇవ్వాలని తద్వారా వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషిచేయాలన్నారు.
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని (PMJVK) పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అంశంపై అధికారులు ప్రత్యేక శ్రద్దచూపాలన్నారు. PMJVK పథకం క్రింద ముందుగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కళాశాలల భవనాలు నిర్మించడం వల్ల ఉపయోగం లేదన్నారు. అద్యాపకులు, సిబ్బంది పోస్టుల మంజూరు విషయంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. PMJVK గైడ్ లైన్సుపై అధికారులు అందరూ సమగ్ర అవగాహ కలిగి ఉండాలని, వాటికి అనుగుణంగా ప్రతిపాదనలను రూపొందించాలన్నారు. ప్రాంతాల వారీగా అవసరాలను బట్టి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేని వృత్తి నైపుణ్య అభివృద్ది కేంద్రాలు, సద్బావన మండపాలు, డిజిటల్ లైబ్రరీలు, హస్తకళల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అదనపు తరగతి గదులు, వసతి గృహ భవనాల నిర్మాణం వంటి పనుల ప్రతిపాదనలను 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మైనారిటీ విద్యార్థుల సంక్షేమానికై నిర్వహిస్తున్న వసతి గృహాలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించుకొనే అంశంపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ఇందుకై స్థలాలు ఉన్నచోట్ల PMJVK పథకం క్రింద శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రతిపాదించాలన్నారు. విజయవాడ, విశాఖపట్నం లలో వచ్చే విద్యా సంవత్సరం నుండే అల్పసంఖ్యాక విద్యార్థుల వసతి గృహాలను అద్దె భవనాల్లోనైనా ప్రారంబించేందుకు జిల్లాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలన మంత్రి ఆదేశించారు.
నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించుటకు అర్హులైన పాస్టర్లను గుర్తించే విషయంలో నెలకొన్న సమస్యలను సమీక్షిస్తూ చర్చి పేరున భూమి రిజిష్టరు అయిన చర్చిలలోని పాస్టర్లే అర్హులు గుర్తించడం అనే నిబంధన పెద్ద ఆటంకంగా ఉందని గుర్తించిన మంత్రి ఈ నిబందన మినహాయింపుకై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు.
రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కమిషనర్ శారదా దేవి మాట్లాడుతూ రాష్ట్రంలో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, అభివృద్దికై అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను, వాటి ప్రగతిని మంత్రికి వివరించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సి.ఇ.ఓ. అలీమ్ బాషా రాష్ట్రంలో వక్పు బోర్డు భూముల పరిరక్షణకు, కోర్టుల్లో పెండింగ్ లోనున్న పలు కేసుల సత్వర పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి తెలియజేశారు.
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎ.ఎం.డి.ఇంతియాజ్, రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదమ్ సాహెబ్, అల్పసంఖ్యాక వర్గాల విద్య అభివృద్ది కేంద్రం డైరెక్టర్ ఎస్.మస్తాన్ వలీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *