-ఇలాగైతే ఎన్నికలు నిర్వహణ ఎందుకు?
-ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు
-కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం
-స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి
-సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, దాడులకు పాల్పడటమే కాకుండా నామినేషన్ పత్రాలను బహిరంగంగా చించివేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు.
గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రిగ్గింగ్, దొంగ ఓట్లు, ఓటర్లకు డబ్బుల పంపిణీ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఈసారి నామినేషన్ కేంద్రాల వద్దకే మారణాయుధాలతో గుంపులుగా చేరి అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తాను ఊహించలేదని పేర్కొన్నారు.
కూటమి నేతలు, పోలీసులపై తీవ్ర ఆరోపణలు
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పోలీసుల సహకారంతో ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరిస్తూ, దాడులు చేస్తూ నామినేషన్ పత్రాలను చించివేయడం దుర్మార్గం అన్నారు. ఒంగోలు సమీపంలోని పామూరులో ప్రతిపక్షాలకు చెందిన నలుగురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతించగా, అక్కడ అప్పటికే ఉన్న సుమారు 400 మంది అధికార పార్టీ కార్యకర్తలు, పోలీసులు కలిసి వారిపై దాడి చేసి నామినేషన్ పత్రాలను చించివేశారని, ఇదే మీ ఎన్నికల నిర్వహణా అని రామకృష్ణ ప్రశ్నించారు.
మహిళా అభ్యర్థులను సైతం అవమానిస్తూ, జుట్టు పట్టుకుని లాగి నామినేషన్ పత్రాలను చింపివేసిన ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు, వారినే అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.
అధికార పార్టీకి పోలీసుల ఊడిగం
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నాయని ఆయన విమర్శించారు . ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు, తమ విధులను పక్కనపెట్టి అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన రీతిలో స్పందించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే నివేదికలు తెప్పించుకోవడానికి స్పందించడం ఆందోళనకరమన్నారు. సంబంధిత అధికారులపై ఆధారపడి నివేదికలు తెప్పించుకుంటే వాటి నిష్పాక్షికతపై అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చంద్రబాబు రాజకీయ జీవితానికే మాయని మచ్చ
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేసిన రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దుర్మార్గంగా, అవినీతిమయంగా, అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియ సాగడం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి, వాటిని పాతరేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది ఆయన రాజకీయ జీవితానికే మాయని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు.
జాతీయ స్థాయిలో ఓటర్ల జాబితాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లను తొలగిస్తూ ఎన్నికల ప్రక్రియను బిజెపి అపహస్యం చేస్తుందని, ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
ఏకగ్రీవాల ప్రకటనలు రద్దు చేయాలి
దౌర్జన్యాలు, బెదిరింపుల ద్వారా సాధించిన ఏకగ్రీవ ఎన్నికల ప్రకటనలను వెంటనే రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏకగ్రీవంగా ప్రకటించిన ప్రాంతాలన్నింటిలోనూ కొత్తగా నామినేషన్లు స్వీకరించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా, ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని స్వేచ్ఛగా ఎన్నుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన ఎన్నికల వాతావరణాన్ని పునరుద్ధరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
