-మాజీ మంత్రి వెలంపల్లి, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎన్నికల ప్రచార పాదయాత్ర అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఉదయం 7:00 గంటలకు 32వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ పాదయాత్ర 32వ డివిజన్ నుంచి మొదలై వరుసగా 35,36 మరియు 37వ డివిజన్ల మీదుగా చెరువు సెంటర్ మరియు చెట్టు వరకు సాగింది. దారిపొడవునా స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు మంగళ హారతులతో నేతలకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ అభ్యర్థి శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పాల్గొని స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. వీరితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు షేక్ హయత్ షరీఫ్, ఎద్దు జీవమని, సంకా పరమేశ్వరరావు, పువ్వాడ చిన్న వెంకటేశ్వరరావు మరియు పలువురు పార్టీ ముఖ్య నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించి నగర సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమం మరియు అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
