విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రోత్సాహక మండలి సభ్యులు డాక్టర్ తరుణ్ కాకాని, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతి చాప్టర్‌కు చెందిన టీటీఏఏ (Tours and Travel Association of Andhra) ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పర్యాటకుల రాకపోకలను మరింత సులభతరం చేయడం, విమానయాన సౌకర్యాల విస్తరణ, టూర్స్ అండ్ ట్రావెల్ రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు విమానాశ్రయ అధికారులు, పర్యాటక ప్రోత్సాహక మండలి, ట్రావెల్ అసోసియేషన్లు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను చర్చించారు.
ఈ సమావేశం ఎంతో సానుకూలంగా, ఫలవంతంగా సాగడం పట్ల డాక్టర్ తరుణ్ కాకాని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలు పర్యాటక రంగ అభివృద్ధికి, విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక గుర్తింపు తీసుకురావడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్‌తో డాక్టర్ తరుణ్ కాకాని భేటీ
