-రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో కలిసి నగరంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులతో కలిసి మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు, కుమ్మరిగూడెంలోని ఖాళీ ప్రదేశం, పోతేపల్లి జ్యువెలరీ పార్కులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వారు కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మున్సిపల్, రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పిదప ఆయన స్థానిక రహదారులు భవనాలు అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం ఎంతో చరిత్ర కలిగిన నగరమని, భారతదేశంలో రెండో మున్సిపాలిటీగా 1864లో ఏర్పడిందన్నారు. నగరం కార్పొరేషన్ గా ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య నగరానికి విచ్చేసి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఆయా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పచ్చదనం, పారిశుద్ధ్యం నిర్వహణ, కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల అక్టోబర్ రెండవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించి, ఎంతోకాలంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను తక్షణమే తరలించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో మరల ముఖ్యమంత్రి నగరాన్ని సందర్శించేనాటికి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.
అదేవిధంగా జువెలరీ పార్కును సందర్శించి ఆ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, రసాయనాల వినియోగంతో ఆ ప్రాంత భూగర్భ జలాలు కాలుష్యం కావడం తదితర సమస్యలను పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలో డంపింగ్ యార్డులోని చెత్తను తరలించి ఆ ప్రాంతంలో పార్కు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నగర సుందరీకరణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చెబుతూ తడి పొడి చెత్తను వేరువేరుగా నిర్వహించాలని, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు దీనిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
నగర సుందరీకరణకు అవసరమైన నిధులను సమీకరించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారానే ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, ప్రగతి సాధ్యం అన్నారు. మచిలీపట్నం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లేందుకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ కాలుష్య రహితంగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జోనల్ అధికారి జోత్స్న, రీజనల్ అధికారి శ్రీనివాసరావు, బందరు ఆర్డీవో కే స్వాతి, నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, తహసిల్దార్ మధుసూదనరావు, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కుంచె నాని, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.