Breaking News

నేటి నుంచి 35వ పుస్తక మహోత్సవ మహా యజ్ఞం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తక ప్రియులు, విజ్ఞాన సముపార్జకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న పుస్తకాల పండుగ ప్రారంభమైంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గత మూడున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా నూతన వత్సరం అక్షర శ్రీకారంతో ప్రారంభించే పుస్తక మహోత్సవ మహా యజ్ఞం ఈనెల 2వ తేదీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమవుతుందని బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి టి మనోహర్ నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం మహోత్సవ ప్రారంభంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2వ నుంచి 12వ తేదీ వరకు 12 రోజులపాటు మహోత్సవం కొనసాగుతుందని తెలిపారు. గతంలో రానటువంటి ఆంగ్ల ప్రచురణ కర్తలు విచ్చేస్తున్నారని, ఈ ఏడాది 234 స్టాల్స్ తో అనేకమంది పబ్లిషర్స్ పాల్గొంటున్నారని తెలిపారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు (సాహితీ నవజీవన్ బుక్ లింక్స్) పేరు పెట్టడం జరిగిందని, అలానే ప్రధాన సాహితీ వేదికకు ప్రముఖ పత్రికా సంపాదకుడు చెరుకూరి రామోజీరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల కార్యక్రమాలు జరుగు ప్రతిభా వేదికకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. రెండవ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అదేవిధంగా జనవరి 6వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్ధార్థ కళాశాల నుండి పుస్తక మహోత్సవం వరకు జరుగుతుందని, పుస్తక ప్రియుల పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరి కె విజయానంద్ ప్రారంభిస్తారని తెలిపారు. రతన్ టాటా ప్రతిభా వేదికపై విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు 2 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని బుద్ధి వికాసానికి మానసిక వికాసానికి ఉపయోగపడే, అంతర్లీనంగా వారిలో ఉన్న ప్రతిభను ప్రకటితం చేసుకునే ఎన్నో కార్యక్రమాలు ఆ వేదికపై జరుగుతాయని తెలిపారు. రెండవ తేదీ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్రను ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రతి సాహితీ వేదికపై సంస్మరణ సభలు, పుస్తకాల ఆవిష్కరణలు, ప్రముఖుల జయంతి ఉత్సవములు, శతజయంతి సభలు, సాహితీ ప్రసంగాలు జరుగుతాయని 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగింపు సభ, బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. పుస్తక మహోత్సవానికి విచ్చేసేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహోత్సవ ప్రాంగణాన్ని తీర్చి దిద్దడం జరిగిందని తెలిపారు. సమావేశంలో బుక్ ఫెస్టివల్ సోసైటీ అధ్యక్షుడు కె లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడు బెల్లపు బాబ్జి, కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ సంయుక్త కార్యదర్శి కె రవి, సభ్యులు విశ్వేశ్వరరావు, గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొని రెండు వేదికలపై 12 రోజులు జరిగే కార్యక్రమాల వివరాలను సమగ్రంగా తెలియచేశారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *