-పాస్టర్స్ జెఎసి, పాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవ.గోవాడ రాబర్ట్ సునీల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న తరుణంలో క్రైస్తవ సమాజం సంయమనం పాటించాలని పాస్టర్స్ జెఎసి, పాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవ.గోవాడ రాబర్ట్ సునీల్ కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి పై పాస్టర్లు, రాజకీయ నాయకులు వారికి తెలిసీ తెలియని విషయాలను వివిధ టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ద్వారా అనునిత్యం ప్రచారం చేస్తూ క్రైస్తవ సంఘాలకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంటుందన్నారు. కావున దర్యాప్తు పూర్తి అయ్యే వరకు విశ్లేషణలను ఆపాలని కోరారు. ఒకవేళ కేసును తప్పుదోవ పట్టించినట్లయితే న్యాయపరమైన పద్దతిలో పోరాటం చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారి పై పూర్తి ఆధారాలతో హోం మంత్రి ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రాధా మనోహర్ దాస్ క్రైస్తవ్యం గురించి, పాస్టర్లు గురించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నందున ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో అన్ని జిల్లాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి, హోం మంత్రి ని కలిసి ప్రవీణ్ పగడాల మృతి పట్ల నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరనున్నట్లు తెలిపారు.