గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి రోజు ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా ప్రజారోగ్య విభాగం క్షేత్ర స్థాయిలో పిన్ పాయింట్ ప్రోగ్రాం సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ గారు కెవిపి కాలనీ, ఆర్.అగ్రహారం, శారదా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయడం ద్వారా ప్రధాన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ లేకుండా చేయవచ్చన్నారు. డ్రైన్లు శుభ్రం చేయడం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ మధ్యాహ్నం సమయంలో కార్మికులు డ్రైన్లు శుభ్రం చేసేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే శానిటేషన్ కార్యదర్శులు, కార్మికులు వ్యర్ధాలను తడిపొడిగా వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. కమర్షియల్ సంస్థలు వ్యర్ధాలను రోడ్ల మీద వేయకుండా నోటీసులు ఇవ్వాలని, పునరావృతం అయితే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలన్నారు.
పర్యటనలో ఏసిపి రెహ్మాన్, డిఈఈ మధుసూదన్, ఎస్ఎస్ ఐజాక్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
