గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్ధాలపై ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియచేయవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో రూ.5కే పేదలకు ఆహారం అందిస్తుందన్నారు. క్యాంటీన్ల సమయం, ఆహారం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారన్నారు. కనుక క్యాంటీన్ కు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యాంటీన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చని పేర్కొన్నారు. క్యాంటీన్ల పర్యవేక్షణకు జిఎంసి నుండి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని తెలిపారు.
