-నాడునేడు మొదటిదశ కింద 3600 కోట్లతో 15వేల 714 పాఠశాలల ఆధునీకరణ
-రెండవ దశలో మరో 4వేల 456 కోట్లతో పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు
-ప్రి-ప్రైమరీ విద్యావ్యవస్థ మరింత పటిష్టతకు నూతన విధానం అన్నివిధాలా దోహదం
-ఈవిద్యావిధానంపై త్వరలో ప్రాంతాలవారీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు
-రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు విద్యార్ధులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.మంగళవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ రిఫార్మ్స్ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ పై సంబంధిత లైన్ డిపార్టుమెంట్లతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ విద్యా ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగంలో అనేక సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.పేదరికంతో ఏవిద్యార్ధీ మధ్యలో చదువు మానివేసే పరిస్థితి ఉండకూదని పేదరికం విద్యను అభ్యసించేందుకు ఏమాత్రం అడ్డుకారాదనే లక్ష్యంతో సియం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధన్యతను ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం-2020 సిఫార్సుల అమలుపై ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతోను, ఉపాధ్యాయ,గ్రాడ్యుయేట్ ఎంఎల్సిలతోను రెండు విడతలు సమావేశాలు నిర్వహించగా ప్రస్తుతం వివిధ లైన్ డిపార్టుమెంట్ల కార్యదర్శులు,హెచ్ఓడిలతోపాటు సంబంధిత శాఖల మంత్రులతో కలిసి ఈసమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వాటిలో ముఖ్యంగా మనబడి,నాడు-నేడు,జగనన్న విద్యాకానుక,అమ్మఒడి వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ జాతీయ విద్యా విధానం రూపకర్త డా.కస్తూరి రంగన్ వంటి ప్రముఖుల ప్రశంసలందుకోవడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 44వేల పాఠశాలలుండగా నాడు నేడు మొదటి దశ కింద 3వేల 600 కోట్ల రూ.ల వ్యయంతో 18వేల 20 పాఠశాలలను ఆధునీకరించగా రెండవ విడతలో మరో 4వేల కోట్లతో పాఠశాలల్లో కనీస వసతులను కల్పించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.ప్రీ,ప్రైమరీ పాఠశాల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు నూతన విద్యావిధానం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.ముఖ్యంగా ప్రాధమిక విద్య స్థాయిలోనే విద్యార్ధికి పటిష్టమైన పునాది వేసేందుకు నాంది పలికేందుకు ప్రతిపాదించామని ఆదిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.పూర్వ ప్రాధమిక విద్య నుండి ఇంటర్మీడియెట్ వరకూ విద్యను అందించే ఆరు అంచెల నూతన విద్యావిధానానికి ప్రతిపాదించామని మంత్రి పేర్కొన్నారు.ఈనూతన విద్యావిధానంపై ఎంపి,ఎంఎల్సి,ఎంఎల్ఏ తదితర ప్రజా ప్రతినిధులకు కూడా పూర్తి అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా విద్యాభివృద్ధే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.నైపుణ్యంతో కూడిన మెరుగైన విద్యను అందించడం ద్వారా విద్యార్ధులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఆశయమని ఆదిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.నూతన విద్యావిధానం అమలులో మన రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఈవిషయంలో మన ప్రక్క రాష్ట్రం తెలంగాణా మన రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను తెల్సుకుని అక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు.
రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు.సమాజంలోని పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే పరిష్కారమని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలును ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించుకోవడం జరుగుతుందని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.
రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ నూతన విద్యా విధానం-2020పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించి గత రెండేళ్లుగా విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నారని తెలిపారు.ఈనూతన విద్యా విధానంతో ఏఒక్క పాఠశాలను, ఉపాధ్యాయుని లేదా అంగన్వాడీ కేంద్రాన్ని లేదా అంగన్వాడీ కార్యకర్తను తొలగించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 45వేల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అన్ని పాఠశాలల్లో ఓకే విధమైన రుచి ఉండేలా ఈపధకాన్ని పటిష్ట వంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.అంతేగాక దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్(ద్విభాషా)పాఠ్యపుస్తకాలను అనగా ఒక పేజీలో ఎడమవైపు తెలుగు, కుడివైపు ఆంగ్లంలో వీటిని ముద్రించడం జరిగిందని తెలిపారు.మన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే రీతిలో వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా విధానంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.ఈవిద్యా సంవత్సరం నుండే అమలు చేయనున్న ఈ నూతన విద్యా విధానంతో ఒకే ప్రాంగణంలో ప్రాధమిక,ఉన్నత పాఠశాలలు ఉండ నున్నాయని వివరించారు.
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్.అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో 55వేల అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో 50 శాతం వరకూ ప్రైవేట్ భవనాల్లోనే ఉన్నాయని చెప్పారు.గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో గిరిజన ప్రాంత విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇంకా ఈసమావేశంలో పలువురు లైన్ డిపార్ట్మెంట్ల శాఖాధిపతులు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.