-మండల ప్రత్యేకాధికారి డి. విజయలక్ష్మి
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని పామర్రు మండల ప్రత్యేకాధికారి మరియు డివిజనల్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ డి. విజయలక్ష్మి అన్నారు. గురువారం పామర్రు మండలం జుజ్జువరం, కొండిపర్రు గ్రామ సచివాలయాలను తాహశీల్థారు, యంపీడీవోలతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆయా గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకుఅందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ లబ్దిదారులకు చేరువ చేసే ప్రభుత్వ పథకాలను నిర్ణీత కాల వ్యవధిలోనే అర్హులకు అందించాలన్నారు. జాప్యానికి తావులేకుండా క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. కోవిడ్ నియంత్రణే లక్ష్యం వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కరు ఇంటింటికీ వెళ్ళి ఫీవర్ సర్వే క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పరిశరాలు పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ గ్రామాల్లో శానిటేషన్, అంతర్గత రహదారులుశుభ్రత, మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలు శుభ్ర పరిచే విధంగా ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందింస్తున్న పథకాల అర్హతల తెలియజేసే పట్టికలు, పోస్టర్లు ప్రజలకు తెలియజేసే విధంగా సూచిక బోర్డుల్లో ప్రదర్శించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో పాఠశాలను సందర్శించారు. మండల ప్రత్యేకాధికారి వెంట తాహశీల్థారు సురేష్ బాబు, యంపీడీవో రామకృష్ణ, సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.