-నున్న వికాస్ కాలేజీలో అండర్ -19 హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్
-ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువత చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నున్న వికాస్ కాలేజీలో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యండ్ బాల్ జూనియర్ గాల్స్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతాయన్నారు. పోటీతత్వం, సృజనాత్మకత అలవడుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో ప్రావీణ్యతను పెంచుకోవడంతో పాటు ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా మంచి క్రీడాకారుడిగా ఎదగవచ్చని తెలిపారు. క్రీడా రంగంలో రాణిస్తూ, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, ఉన్నతస్థాయి విద్యా కోర్సులు చదివేందుకు క్రీడా రిజర్వేషన్ కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎంతో మంది క్రీడాకారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ సహకారంతో క్రీడాకారులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని మల్లాది విష్ణు అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం మొదటి అంతస్తులో వసతి ఏర్పాట్లు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుని యువత క్రీడలలో రాణించాలని సూచించారు. పీవీ సింధుని ఆదర్శంగా తీసుకుని.. లక్నో జరగబోయే నేషనల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారిణులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పెనుమత్స సత్యనారాయణరాజు, కార్పొరేటర్ జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.