-విద్యుత్తు రంగం బలోపేతానికి అత్యుత్తుమ విధానాలు
-రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
-వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం
-సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
-విద్యుత్తు సంస్థలకు ప్రభుత్వం ఆదేశం
-రూ.3669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి
-రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి తెలిపిన డిస్కంల సీఎండీలు
-విద్యుత్తు కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయం రూ.32 వేల కోట్లు!
-విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు 2019-21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల
-2019-21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64 వేల కోట్లు చెల్లించిన విద్యుత్తు సంస్థలు
-ఆర్థిక అవరోధాలున్నా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం
-విద్యుత్తు రంగాన్ని ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష
-ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పెద్దపీట వేయాలి
-సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ
– ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని ఆధునికీకరించడంతో పాటు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్తు సంస్థల్లో అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టనుంది. విద్యుత్తు రంగం సమగ్రాభివృద్ధి, విజయం కోసం త్వరలోనే సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. ట్రాన్స్ కో జేఎండీ కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్ధన రెడ్డి , హెచ్.హరనాథరావు, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్లు కె.ప్రవీణ్ కుమార్, కె.ముత్తుపాండియన్,, ఇతర అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో శ్రీకాంత్ మాట్లాడారు. చౌక విద్యుత్తు ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశవ్యాప్తంగా మన విద్యుత్తు రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు.
రాష్ట్ర విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శ్రీకాంత్ చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్తు రంగ వృత్తి నిపుణుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. అలాగే సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్తు సంస్థలకు సూచించిందని తెలిపారు.
డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3669 కోట్ల ట్రూ అఫ్ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించిందని సీఎండీలు వివరించారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఏ ఆలోచన అయినా, ఏ చర్య అయినా, ఎలాంటి అడుగు వేసినా విద్యుత్తు రంగం బలోపేతం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని శ్రీకాంత్ స్పష్టం చేశారు. విద్యుత్తు సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు 24×7 నాణ్యమైన విద్యుత్తును అందించగలుగుతామని చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014, జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా.. ఏప్రిల్ 1, 2019 నాటికి ఇవి రూ.32,000 కోట్లకు చేరినట్లు అధికారులు వివరించారు. ‘‘ఏపీ విద్యుత్తు రంగం ఇంతటి ఆర్థిక ఇబ్బందులని గడిచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్న విద్యుత్తు సంస్థలను గట్టెక్కించేందుకు 2019-20 నుంచి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది.
మార్చి 31, 2019 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు విడుదల చేసింది. విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద 2019-21 సంవత్సరానికి గాను మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. విద్యుత్తు సంస్థలు 2019-21 మధ్య విద్యుత్తు కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. ఇంతటి ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ప్రభుత్వం రైతులు, బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం పథకాలు కొనసాగిస్తూనే ఉంది. రైతులకు పగటి పూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తోంది. ఉచిత విద్యుత్తును మరో 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 10 వేల మెగావాట్ల సామర్ధ్యం గల మెగా సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు గట్టి చర్యలు చేపట్టింది.
చౌక విద్యుత్తు అంశాన్ని విజయవంతంగా చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోంది. రూ.2342 కోట్లు ఆదా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ అంశంలో ఏపీ విద్యుత్తు సంస్థల పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా కొనియాడింది.
విద్యుత్తు రంగాన్ని ప్రగతి శీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారలకు 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. అలాగే విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019-20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020-21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019-20లో యూనిట్ కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020-21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది.
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్తు సంస్థలు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారన్నారు. ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్న విద్యుత్తు సంస్థలు వినియోగదారులకు లబ్ధి చేకూర్చేందుకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. వినియోగదారుల సంక్షేమం కోసం నవరత్నాలు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
వినియోగదారుల నైతిక మద్దతు, విద్యుత్తు రంగానికి కొండంత బలమని, వినియోగదారుల సంక్షేమమే ధ్యేయంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తారని శ్రీకాంత్ తెలిపారు