-నగర ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం పట్ల చంద్రబాబు విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు భరోసాని కల్పిస్తూ.. ఆరో రోజు పర్యటన సాగింది. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పెన్షన్లపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా డెత్ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరగకూడదని సిబ్బందికి సూచించారు. పర్యటనలో భాగంగా స్థానిక రేషన్ దుకాణంలో సరుకుల పంపిణీ విధానాన్ని మల్లాది విష్ణు పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా కొత్తకార్డుల జారీ, పేర్ల తొలగింపు తదితర సేవలు 10 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్న ‘రిజిస్ట్రేషన్ మేళా’ పై స్థానికులకు విస్తృతంగా అవగాహన కల్పించవలసిందిగా అధికారులకు సూచించారు. మరోవైపు డివిజన్ లో అనుమానాస్పద ప్రదేశాలలో నిఘా పెంచాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరుస ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతిభ్రమించిందని మల్లాది విష్ణు అన్నారు. ఏం మాట్లాడుతున్నారో కనీస అవగాహన లేకుండా నగరంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. బెజవాడ అంటే తొలి నుంచి చంద్రబాబుకు చులకనభావమని విమర్శించారు. కనుకనే నగరానికి సంబంధంలేని మాదకద్రవ్యాల విషయం తెరపైకి తీసుకువస్తూ.. నగర ఖ్యాతిని దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలకు ఆశ ఎక్కువని.. అద్దెలు ఎక్కువ వసూలు చేస్తారని గతంలోనూ వారి మనోభావాలను చంద్రబాబు గాయపరిచారని గుర్తుచేశారు. సంగీతం, సాహిత్యం, కళలకు రాజధానిగా ప్రసిద్ధి గాంచిన విజయవాడ నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం హయాంలో నగరంలో శాంతిభద్రతల సమస్య ఉండేదని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొల్పారన్నారు. అది చూసి ఓర్వలేకనే నగరంపై ప్రతిపక్ష నేత కుట్రలు పన్నుతున్నారన్నారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు ఐదు అంచెల వ్యవస్థలకు జరిగిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారన్నారు. చివరకు కుప్పం సహా చంద్రబాబు కంచుకోటల స్థానాలలోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మ్రోగించిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాతీర్పును గౌరవించాలని.. విజయవాడ నగర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల దుర్గారావు, రాజా, నాని, గోపి, సుభానీ, ఇస్మాయిల్, కిరణ్, దుర్గాప్రసాద్, కుమారి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.