-న్యూమోనియా నివారణ అవగాహనపై పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శిశువులకు అతి ప్రమాదంగా పరిణమించే న్యూమోనియా వ్యాధి నివారణపై పై తల్లితండ్రులకు అవగాహనా కలిగించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం న్యూమోనియా వ్యాధి నివారణపై ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ న్యూమోనియా ఒక ప్రమాదకరమైన వ్యాధి అని, 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు ముఖ్య కారణమన్నారు. పిల్లలకు న్యూమోనియా సోకకుండా ప్రతీ తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలకు దగ్గు, జలుబు, వేగంగా శ్వాస తీసుకోవడం, అధిక జ్వరం ఉండడం న్యూమోనియా లక్షణాలని, ఆహరం తినలేకపోవడం, శ్వాసలో గురక రావడం, నీరసం, మత్తుగా ఉండడం తీవ్ర లక్షణాలన్నారు. పిల్లల్లో ఆ ప్రాధమిక లక్షణాలు కనపడగానే సమయం వృధా చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకునివెళ్ళి చికిత్స తీసుకోవాలన్నారు. చలికాలం సమయంలో ఈ వ్యాధి విజ్రంభించే అవకాశం ఉన్నందున జిల్లాలో న్యూమోనియా వ్యాధి నివారణ, ప్రజలలో అవగాహనకు ఈనెల 12వ తేదీ నుండి 2022 వ సంవత్సరం ఫిబ్రవరి, 28వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. న్యూమోనియా వ్యాధి నివారణకు ప్రతీ శిశివుకు 6, 14 వారాలు మరియు 9వ నెలలో టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాలు పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పిల్లలను తేమ మరియు చల్లని వాతావరణానికి దూరంగా ఉంచేలా చూడాలన్నారు. ఫీవర్ సర్వే లో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవిలత, ఎల్.శివశంకర్, శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, కె.మోహన్ కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.ఎస్. శోభిత, డి యం హెచ్ ఓ డా.యం.సుహాసిని,డిప్యూటీ డి యం హెచ్ ఓ ఇందుమతి,డా.చైతన్య, డా.సుదర్శన్ బాబు,డా.లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు