Breaking News

హార్టికల్చర్ హబ్ గా నూజివీడు ప్రాంతం : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

-300 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్
-నూజివీడులో మామిడి రైతుల అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక మామిడి పరిశోధనా కేంద్రంలో గురువారం సీజనల్ కండీషన్స్ లో మామిడి పంటల పరిరక్షణపై డివిజన్ స్థాయి మామిడి రైతులకు జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ప్రాంతం మామిడి పళ్లకు బ్రాండ్ అన్నారు. నూజివీడు ప్రాంతంలో పండే మామిడి పళ్లకు దేశ , విదేశాలలో మంచి డిమాండ్ ఉందన్నారు. హైద్రాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలలో నూజివీడు మామిడి పళ్లకు ఎంతో మంచి డిమాండ్ ఉందన్నారు. నూజివీడు ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో మామిడి, జామ, అరటి వంటి ఉద్యానవన పంటల అభివృద్ధికి 300 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అధిక వయస్సు కలిగిన మామిడి చెట్లను తొలగించకుండా ప్రూనింగ్ ద్వారా పంటకు అనుకూలంగా సంరక్షించుకోవచ్చన్నారు. మామిడి తోటల పునరుద్దరణకు హెక్టర్కు 20 వేల రూపాయలు, మామిడి తోటలకు ఫ్రూనింగ్ విధానం ద్వారా కేనోపి నిర్వహణకు హెక్టర్కు 17 వేల 500 రూపాయలు అందించడం జరిగిందన్నారు. అదే విధంగా మామిడి తోటలలో తెగుళ్ల నివారణ పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చేయించామన్నారు. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం, సమగ్ర మామిడి పండ్ల శుద్ధి, చీడ నియంత్ర కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాలను నిరంతర యజ్ఞంలా ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. రైతుభరోసా, వడ్డీలేని రుణాలు, సాగుకు ఉచిత విద్యుత్, ఉచిత పంటల భీమా వంటి ఎన్నో కార్యక్రమాలతో పాటు, రైతుకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలను నష్టపోయిన ఉద్యానవన రైతులను ఆదుకున్నామన్నారు. రైతులు తాము పండించిన పంటలకు అధిక ధర లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావలసిన అవసరం ఉందన్నారు. సీజనల్ కండిషన్స్ లో మామిడి పంటను పరిరక్షించుకునేందుకు వ్యవసాయ, ఉద్యానవన అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేయాలన్నారు. మామిడి పంటకు చీడపీడలు. సోకకుండా, మంగు వంటి వ్యాధుల బారిన పడకుండా శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖాధికారులు రైతులకు సూచనలు చేయాలన్నారు. మామిడి పూత దశలో రాలిపోకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలుపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ముందుగా కేంద్రం ఆవరణలో శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు మొక్కను నాటారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గుడిమల్ల కృష్ణంరాజు నూజివీడు మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ కౌన్సిలర్ శీలం రాము ఎంపీపీ అరేపల్లి శిరీష ఏ పి ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్ విద్యాసాగర్, మండల వ్యవసాయశాఖ అధికారి చాముండేశ్వరి, ఉద్యావనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి, ఉద్యానవనాలు అధికారి రత్నమాల, శాస్త్రవేత్తలు కనకమాలక్ష్మి, జె స్రవంతి ,ఆర్ రాజ్యలక్ష్మి, ఉద్యానవన శాఖ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *