Breaking News

సహజ వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత : బిశ్వభూషణ్ హరిచందన్


-కౌశల్ 2021 విజేతలకు రాజ్ భవన్ లో ధృవీకరణ పత్రాలు అందచేసిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహజ వనరులైన నీరు, నేల, వృక్షసంపదలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మననందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందణ్ అన్నారు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఔచిత్యాన్ని కలిగిన సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను రక్షించడం, వ్యాప్తి చేయడం మన కర్తవ్యమన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయిక్త ఆధ్వర్యంలో కౌశల్-2021 పేరిట నిర్వహించిన పోటీలలో రాష్ట్ర స్ధాయి విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు గవర్నర్ ధృవీకరణ పత్రాలు అందచేసారు. రాజ్ భవన్ దర్చార్ హాలు వేదికగా బుధవారం హైబ్రీడ్ విధానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కౌశల్-2021 రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించటం ముదావహమని తద్వారా గ్రామీణ విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.

భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల కలయికతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వచించ గలుగుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు. వందల సంవత్సరాలుగా మన దేశం యోగా, ఆయుర్వేదాల కలయికను సంపూర్ణ ఆరోగ్య సాధనంగా నొక్కి చెప్పిందన్నారు. ఆయుర్వేదం నిరామయ స్థితిని సాధించడంలో సహాయ పడుతుందని, ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రయోజనాలు పొందగలుగు తున్నారన్నారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థలను నాశనం చేసి స్వంత నమూనాను స్థాపించేక్రమంలో బ్రిటిష్ పాలకులు సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు భారతీయ విజ్ఞాన మండలి వంటి సంస్ధలు గొప్ప సహకారం అందించాయన్నారు. వివిధ కార్యకలాపాల ద్వారా ప్రాచీన విజ్ఞానం, ఆధునిక శాస్త్రాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి విజ్ఞాన భారతి ప్రయత్నిస్తోందని, శాస్త్ర సాంకేతిక రంగాల ఉన్నతికి భారతీయులు చేసిన కృషిని విశ్వవ్యాప్తం చేయటంలో ఈ సంస్ధ మంచి సహకారాన్ని అందిస్తుందన్నారు.

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అందించిన ‘జై జవాన్- జై కిసాన్’ నినాదం దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురాగా, పోఖ్రాన్ పరీక్ష తర్వాత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ‘జై విజ్ఞాన్’ నినాదాన్ని అందించారన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మనకు స్వావలంబన దిశగా ‘జై అనుసంధాన్’ నినాదాన్ని తీసుకువచ్చారని, ఈ నినాదాలు మన ఆలోచనలను విప్లవాత్మకంగా మార్చడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంటాయన్నారు. ప్రధాని చెప్పినట్లుగా ఆత్మ నిర్భర్ భారత్‌ను సాధించేందుకు స్వదేశీ స్ఫూర్తిని పురికొల్పడం ద్వారా మన దేశాన్ని అన్ని రంగాలలో స్వావలంబన దిశగా పయనింప చేయాలని గౌరవ గవర్నర్ ఉటంకించారు. చివరగా విజేతలుగా నిలిచిన చిన్నారులతో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, భారతీయ విజ్ఞాన మండలి పాలకమండలి సభ్యుడు డాక్టర్ కార్తికేయ మిశ్రా, చంద్ర శేఖర్ తదితరుల పాల్గొన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *