-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-వేడుకగా జెఎన్ టియు కాకినాడ స్నాతకోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యా విధానం 2020 దేశీయ విద్యను ప్రపంచ స్ధాయికి తీసుకువెళుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతదేశాన్ని నాలెడ్జ్-హబ్‌గా మార్చే లక్ష్యంతో మరింత సమగ్రమైన, దూరదృష్టి గల విద్యా విధానాన్ని మనం అమలు చేసుకుంటున్నామన్నారు. కులపతి హోదాలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – కాకినాడ ఎనిమిదవ స్నాతకోత్సవంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పాల్గొన్నారు. విధ్యార్ధులతో కూడిన కార్యక్రమానికి కాకినాడ వేదిక కాగా, గౌరవ హరిచందన్ విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆన్ లైన్ విధానంలో ప్రసంగించారు. 75వ స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని అట్టడుగు స్థాయి నుండి అమలు చేసేందుకు పాఠ్యపుస్తకాల్లో విషయ సవరణ చేపట్టారన్నారు.
జాతీయ స్ధాయి పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ను అనుసరించి పాఠ్యాంశాలు, కంటెంట్, బోధనా విధానాన్ని రూపుదిద్దాల్సి ఉందన్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న శుభతరుణంలో, 1946 జులైలో ఏర్పాటైన జెఎన్ టియు – కాకినాడ కూడా తన ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. కొత్త పాలసీ కింద ఏర్పాటైన నియంత్రణ సంస్ధ ‘నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్)’ బోధనా ప్రక్రియతో సాంకేతికతను అనుసంధానించటం లక్ష్యంగా పెట్టుకుందని, అభ్యాస అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని యోచిస్తోందన్నారు.
‘కోవాక్సిన్’ , ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ల అభివృద్ధి, తయారీతో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని, కరోనా మహమ్మారి నుండి మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిందని గవర్నర్ అన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన వి.వి.ఆర్. శాస్త్రి మాట్లాడుతూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే పోటీని తట్టుకుని నిలబడగలుగుతామన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా పాల్గొనగా, కాకినాడ నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య జి.వి.ఆర్. ప్రసాద రాజు స్వాగత ఉపన్యాసం చేసి, విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను సమర్పించారు. అచార్య ఎన్.మోహన్ రావు, అచార్య ఎ.ఎస్.ఎన్. చక్రవర్తి విశ్వవిద్యాలయం తరపున గవర్నర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.