Breaking News

అన్నదాతలకు.. మీటర్లతో మేలే..!

-వ్యవసాయ పంపుసెట్లకు మెరుగైన విద్యుత్తు
-మీటర్ల బిగింపుతో పారదర్శకత, జవాబుదారీతనం
-నాణ్యమైన కరెంటు కోసం డిస్కంలను నిలదీయొచ్చు
-సిక్కోలులో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
-నేరుగా నగదు బదిలీ పథకంతో 33.75 మిలియన్ యూనిట్లు ఆదా
-ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
-వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లతో విద్యుత్తు మౌలిక సదుపాయాల సామర్థ్యం తెలుస్తుంది
-నాణ్యమైన కరెంటు అందించేందుకు దోహదపడుతుంది
-డీబీటీ పథకం కింద మీటర్లు బిగిస్తాం
-ఈ పథకంతో రైతులు సాధికారత సాధిస్తారు
-మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-సెకి నుంచి 7000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం
-రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది
-రైతుల సంక్షేమంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
-సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వసించేది ఇదే..
-రైతులకు ఎస్క్రో బ్యాంకు ఖాతాలు తెరిపించండి
-విద్యుత్తు సంస్థలకు మంత్రి ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వసిస్తారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తారు. అందులో భాగంగా అన్నదాతలకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన కరెంటును ఉచితంగా సరఫరా చేసేందుకు గట్టి ప్రణాళిక రచించారు . కష్టనష్టాలు ఎదురైనా రైతు మోములో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. అన్నదాతలు సంతోషంగా ఉండడానికి ఏం చేసేందుకైనా వెనకాడని తత్వం ఆయన సొంతం. రాబోయే 25 ఏళ్ల పాటు రైతులు తమకు నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలంటూ విద్యుత్తు సంస్థలను నిలదీసేలా ఏర్పాటు చేస్తున్నారు. నేరుగా నగదు బదిలీ పథకం కింద రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్తు సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వ్యవసాయ మీటర్లపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల సందేహాలను నివృత్తి చేయనున్నాయి. వ్యవసాయ మీటర్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. ‘‘అపోహలు అక్కర్లేదు.. ప్రభుత్వం ఏం చేసినా అన్నదాతల మంచికే’’ అని, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి చెప్పారు.
ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా మీద టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష లో అధికారులు మాట్లాడుతూ రైతులకు సాధికారత కల్పించే ‘నేరుగా నగదు బదిలీ (డీబీటీ)’ పథకం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అద్భుత విజయం సాధించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16.34 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. 15.99 లక్షల కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించినట్లు విద్యుత్తు సంస్థలు తెలిపాయి. డీబీటీ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆయా రైతులు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందించడంలో భాగంగా విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని తెలుసుకొని అవసరమైన మేరకు వాటిని మెరుగుపర్చడమే లక్ష్యంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
వ్యవసాయానికి 2018-19లో 10832 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు డిమాండ్ 2021-22లో 17.42 శాతం పెరిగి 12720 మిలియన్ యూనిట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇది 13194 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు .
ఉచిత విద్యుత్తుకు డీబీటీ పథకం సిక్కోలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైందని అధికారులు తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగించినట్లు వెల్లడించారు. 2021-2022లో కనెక్షన్లు 28,393కి పెరిగాయి. కానీ, వినియోగం 67.76 మిలియన్ యూనిట్లకు పరిమితమైంది. డీబీటీ పథకం, ఇతర పొదుపు చర్యల కారణంగా 33.75 మిలియన్ యూనిట్లు ఆదా అయ్యింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడాన్ని ప్రారంభించాయి. ఇలా అమర్చడం వల్ల విద్యుత్తు సంస్థలు నాణ్యమైన విద్యుత్తును అందించగలుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశిష్టమైన డీబీటీ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనుంది. పథకం అమలులో భాగంగా రైతులు నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నగదు మొత్తాన్ని ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఫలితంగా రైతులు నాణ్యమైన కరెంటు కోసం డిస్కంలను నిలదీసే హక్కు వస్తుందని అధికారులు తెలిపారు. విద్యుత్తు సంస్థలకు కూడా జవాబుదారీతనం పెరగడంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మీటర్ల ద్వారా రైతులకు కూడా తాము ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నామన్నదీ తెలుస్తుందని, ఉచిత విద్యుత్తు పథకంపై ఎంత ఖర్చు చేస్తున్నారన్నది కూడా తెలుస్తుందని అధికారులు వివరించారు. దీనివల్ల డిస్కంలు తమ నష్టాలను రైతులకు అందించే సబ్సిడీలో కలిపే అవకాశం కూడా ఉండదన్నారు. ఫలితంగా విద్యుత్తు కొనుగోళ్లు, వృథా, సరఫరా నష్టాల్లో పారదర్శకత వస్తుందని తెలిపారు. దీంతో పాటు వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్తును అందించవచ్చన్నారు.
రాష్ట్రంలో మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే విద్యుత్తు సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో 7000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాయి. ‘‘రాబోయే 25 ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా, నాణ్యమైన విద్యుత్తును అందించాలని నిర్ణయించిన ఏకైక ప్రభుత్వం మాదే. బొగ్గు కొరత, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి మరో 25 ఏళ్ల పాటు సౌర విద్యుత్తు అందుబాటులో ఉంటుంది.
రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని బాగా నమ్ముతారని మంత్రి అన్నారు. రైతుల సంక్షేమంతోనే అభివృద్ధి సాధ్యమని, ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుందని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.
డీబీటీ పథకం గురించి మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. పథకం అమలులో భాగంగా రైతుల ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రాబోయే 25 ఏళ్లపాటు ఉచితంగా విద్యుత్తును అందించడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ఎంత ఖర్చయినా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొంత మంది రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను నమ్మొద్దని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.. ప్రజల మేలు కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
డీబీటీ పథకం కింద రైతులు లబ్ధి పొందేందుకు వారితో ఈఎస్సీఆర్వోడబ్ల్యూ ఖాతాలు తెరిపించాలని విద్యుత్తు సంస్థలను మంత్రి ఆదేశించారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై ఉన్న అపోహలను తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని.. మీటర్లు బిగించడంతో రైతులకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా వివరించాలని చెప్పారు.
ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్ , జె ఎం డీ , హెచ్ ఆర్ డీ & అడ్మిన్ , ఐ పృథ్వి తేజ్, డిస్కామ్ సి ఎం డీలు , హెచ్ హరనాథ రావు , జె పద్మ జనార్ధన రెడ్డి, కె సంతోష రావు , ఏ పీ ట్రాన్స్కో గ్రిడ్ డైరెక్టర్ , ఏ వీ కె భాస్కర్ , తదితర సీనియర్ అధికారులు టెలీకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *