Breaking News

ఆర్టీసీ హౌస్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఛైర్మన్  ఏ. మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు. సంస్థ ఎం.డి.  సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఆయనకు హార్ధిక స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన మార్చ్ ఫాస్ట్ లో ఛైర్మన్  మల్లికార్జున రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తై ఈ రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను దిగ్విజయంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ, జవాహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్, లాల లజపతి రాయ్ , పింగళి వెంకయ్య, చంద్ర శేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీభాయి, సరోజినీ దేవి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, అంబేద్కర్ ఇలా ఎందరో మహనీయుల భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఆగస్టు 15 వ తేదీని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి అమలు చేస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం దేశం అంతటా వైభవోపేతంగా జరుగుతాయని ఆయన కొనియాడారు.
మన భారతదేశం సమానత్వం సాధించి, స్వాతంత్య్ర పాలనా సాగిస్తూ ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఎంతో అభివృద్ధి సాధించి, ప్రపంచ దేశాలన్నింటికీ గర్వకారణంగా, మార్గదర్శకంగా నిలిచి అన్ని రంగాలలోనూ దినదినాభివృద్ధి సాధించిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రవాణా రంగంలో కూడా ఎన్నో సంస్కరణలతో, మార్పులతో ప్రతి రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తున్నాయి.
ఇక మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు నిరంతర సేవలందిస్తూ ప్రగతి పధంలో దూసుకెళ్తూ ఎన్నో రికార్డులను సృష్టించి ఆదర్శప్రాయమైన సంస్థగా నిలుస్తున్నదని తెలిపారు.
మన ఏ.పి.ఎస్.ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు 37.17 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 40 లక్షల మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతోందని అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆర్టీసీ ఎప్పుడూ ముందుండి ఎక్కడి నుండి ఎక్కడికైనా రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల ముందు నుంచే కల్పించడం, బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా బస్సు ట్రాకింగ్ సిస్టం, జి.పి.ఆర్.ఎస్. ఇలా ఎన్నో విధానాలు విజయవంతంగా ప్రవేశపెట్టిందని తెలిపారు.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ప్రవేశపెట్టడం, బస్టాండ్లను ఆధునీకరించడం, ప్రత్యేక పండుగల సమయంలో ప్రయాణీకుల రద్దీని క్రమబద్దీకరించడం కోసం స్పెషల్ బస్సుల ఆపరేషన్ నిర్వహించడం, విద్యార్ధుల కోసం బడి బస్సులు, అలాగే, మహిళా ప్రయాణీకుల కోసం విజయవాడ – హైదరాబాద్, హైదరాబాద్ – విజయవాడ కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంలో కూడా ఆర్టీసీ కి ఆదరాభిమానాలు లభించాయన్నారు. ఇటీవలే, ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, చిల్లర సమస్యను అధిగమించేందుకు TIM మేషీనులో SOFTWARE ను అభివుద్ది పరచి, డిజిటల్ PAYMENT లను ప్రోస్తాహించడం జరిగిందని చైర్మన్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీని, దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిపేందుకు జనవరి 1, 2020 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణి౦చడమే కాకుండా, ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే తన భాద్యతగా మోస్తున్నదని, జీత భత్యాలను కూడా తన ఖజానా నుంచే అందిస్తోందని ఈ విషయంలో ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

అంతేకాకుండా ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చారని, అవి ఏమనగా….
* ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పి.టి.డి. ఉద్యోగులుగా గుర్తించబడ్డారు. రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
* ప్రతి నెలా 1 వ తేదీన జీతం అందడమే కాకుండా, ఆరోగ్యశ్రీ పధకం అమలు, ప్రభుత్వ భీమా పధకం మరియు కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ ద్వారా భీమా సదుపాయం లాంటి ప్రయోజనాలు కూడా పి.టి.డి. ఉద్యోగులు పొందుతున్నారు.
* ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ అమలు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
* నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా కొత్త విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు కార్యాచరణ చేసింది.
* విద్యార్ధులకు బస్ పాస్ లలో రాయితీ కల్పించడం, దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసే ఉద్యోగులకు మంత్లీ పాస్ ద్వారా ప్రయాణంలో రాయితీ, సీనియర్ సిటిజన్లకు రాయితీ, ఇలా ఎన్నో రాయితీలు, పధకాలు ప్రవేశపెట్టింది. .
* టిక్కెట్టేతర ఆదాయం పెంచుకునే క్రమంలో కార్గో సేవలు అంతటా విస్తరించడం, డోర్ టు డోర్ సేవలు అందించడం, పెట్రోల్ బంకుల నిర్వహణ, నిర్వహణ వ్యయం భారం కాకుండా అద్దె బస్సులు ప్రవేశ పెట్టడం, బస్టాండ్లలో స్కూటర్ పార్కింగ్, దుకాణ సముదాయాల నిర్వహణ మరియు మల్టీ ప్లెక్స్ లుగా తీర్చిదిద్ది ఆదాయం పెంచుకోవడం లాంటివి ఎన్నో చేసిందన్నారు.
ఇదే స్పూర్తితో నష్టాలను పూడ్చుకొని, కొంత అయినా లాభాల్లోకి వచ్చేలా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసికట్టుగా శ్రమించి, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని, ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు.
అనంతరం సంస్థ ఛైర్మన్  మల్లికార్జున రెడ్డి, ఎం.డి.  ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఇరువురు కలిసి సంస్థకు సేవలందించిన ఉద్యోగులకు, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇంకా ఈ వేడుకలో ఛైర్మన్ తో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు  ఏ. కోటేశ్వర రావు (అడ్మిన్),  కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్),  పి. కృష్ణ మోహన్ (ఇంజినీరింగ్ ), FA,  రాఘవరెడ్డి,విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  గిడుగు వెంకటేశ్వర రావు, సి.టి.ఎం.  నాగేంద్ర ప్రసాద్, కృష్ణా జిల్లా డి.పి.టి.ఓ. ఎం.వై.దానం, సి.పి.ఎం.  స్వరూపానంద రెడ్డి, విజిలెన్స్ ఏ.డి.  శోభా మంజరి, ఆర్టీసీ హౌస్ ఉన్నతాధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

“రాజమహేంద్రవరం – అనకాపల్లి; రాయచోటి – కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్” – ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *