-శాసనసభ్యులు సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు అందరం సమిష్టి గా కృషి చేయాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఎంజె నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ 38 వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బెంజ్ సర్కిల్ జ్యోతి కన్వెన్షన్ సెంటర్ లో మాదకద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజన చౌదరి,కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో భాగం అవ్వాల్సిన యువత డ్రగ్స్, ఆల్కహాల్, మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటుందన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్, మాఫియాను పెంచి పోషించి యువత భవిష్యత్తును అంధకారం చేశారన్నారు. డ్రగ్స్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. 38 సంవత్సరములుగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ ఎమ్ జె నాయుడు ని అభినందించారు. వైద్యులందరూ ధనార్జనె ధ్యేయంగా కాకుండా మానవతా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలని వ్యాధుల నియంత్రణకు చర్యలను తీసుకోవాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కు పాదం మోపి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు.
కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు, పౌర సమాజానికి అవగాహన,చైతన్యం కలిగించేలా మంచి కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. యువతలో రోజురోజుకీ మాదకద్రవ్యాల వినియోగం పెరగటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ వల్ల ఏర్పడే దుష్ఫలితాలు పట్ల కార్యక్రమాలను రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ జె నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎమ్ జె నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాధవి, డాక్టర్ వంశీ, సైకియాట్రిస్ట్ రాధిక రెడ్డి, సిద్ధార్థ మహిళ కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ దేవినేని అపర్ణ వివిధ కళాశాలల విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.