Breaking News

పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్ధులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫార్మ్ లు అందించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు,బ్యాగులు వంటివన్నీవిద్యార్ధులకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.2024-25 విద్యా సంవత్సర సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ తీసుకుంటున్న సన్నాహక చర్యలను సమీక్షిస్తూ విద్యార్ధులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు,బ్యాగులు,బూట్లు వంటి సకాలంలో అందించే విధంగా చూడాలని స్పష్టం చేశారు.ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు,యూనిఫార్ములు,బ్యాగులు వంటివి సమకూర్చింది ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై సమీక్షిస్తూ ప్రతి రోజు ప్రత్యేకంగా మానిటర్ చేసి సకాలంలో అవి మండల స్టాకు పాయింట్లు తద్వారా పాఠశాలల వారిగా విద్యార్ధులకు అందేలా చూడాలని సిఎస్ ఆదేశించారు.అనంతరం మధ్యాహ్నభోజన పధకం అమలుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అలాగే పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టిన పనుల ప్రగతిని,మధ్యాహ్న భోజన వసతి తదితర అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.
ఈసమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రానున్న విద్యా సంవత్సరానికి తీసుకుంటున్న సన్నాహక ఏర్పాట్లను వివరించారు.జూన్ 12న పాఠశాలలను పున:ప్రారంభించడం జరుగుతుందని జూన్ 10 లోగా విద్యార్ధులకు పాఠ్య,నోటు పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఇప్పటికే 82శాతం పుస్తకాల ప్రచురణ పూర్తయి మండల స్టాకు పాయింట్లకు చేరాయని వివరించారు.రానున్న విద్యా సంవత్సరంలో 1నుండి 10 వరకూ బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను విద్యార్ధులకు అందించడం జరుగుతుందని తెలిపారు.రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి 1నుండి 10 వరకూ మొత్తం 70 లక్షల 42వేల 12 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేయగా వారిలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36 లక్షల 54 వేల 539 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేయడం జరిగిందని వివరించారు.
పాఠశాల విద్యా మౌలిక సదుపాయాల గురించి కమీషనర్ కె.భాస్కర్ వివరిస్తూ నాడు నేడు ఫేజ్-2 కింద 7వేల 29 కోట్ల రూ.లతో వివిధ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం,తాగునీరు,విద్యుత్ సౌకర్యం,ఫర్నిచర్,పెయింటింగ్లు,ఆయా పాఠశాలలకు మరమ్మత్తులు,గ్రీన్ చాక్ బోర్డులు,అదనపు తరగతుల నిర్మాణం,ప్రహరీ గోడల నిర్మాణం,కిచెన్ షెడ్లు,అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.
రానున్న విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజన పధకం అమలు సన్నాహక ఏర్పాట్లపై ఆపధకం డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ వివరిస్తూ పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం,రాగులు,జొన్న వంటివి సమకూర్చుకునేందుకు ఇండెంట్ పెట్టామని తెలిపారు.అలాగే చిక్కి,కోడి గ్రుడ్లు వంటివి సకాలంలో సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
ఇంకా ఈసమావేశంలో ఎపిఎస్డి శ్రీనివాసరావు,పలువురు విద్యాశాఖ డైరెక్టర్లు,అదనపు డైరెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *