-ప్రమాణస్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
-సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర ఆలింగనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని స్పీకర్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ కి ప్రొటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రిజిస్టర్ లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు.
Prajavartha Online Telugu News