Breaking News

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు

-పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి
-ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు మసటిరోజు ఈసీఐ కి చేరాలి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఈ నెల 4 వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4 వ తేదీతో పాటు దానికి ముందు, తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. ఇటు వంటి భావోద్వేగాలతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ఈవీఎం ల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎం కు సీల్ వేసి భద్రపర్చాలని, మరుసటి రోజు చేద్దాంలే అనుకుంటూ ఆ పనిని వాయిదాను వేయవద్దన్నారు. ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు దినానికి మరుసటి రోజే ఈసీఐ కి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇండెక్సు కార్డులో ఎటు వంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలని, ఆయా కార్డులు అన్నీ ఈ నెల 8 వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలన్నారు.

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, అయితే ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను లేక పెన్సిల్ మరియు ప్లైయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలని, అంతకు మించి ఏమి ఉన్నా అనుమతించవద్దన్నారు. అథారిటీ లెటర్సు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలని, వారు సెల్ పోన్ కలిగిఉన్నప్పటికీ ఏమాత్రము అభ్యంతరం తెలపద్దని, అయితే కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ పోన్ తో వారిని అనుమతించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి దృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం మరియు నిష్క్రమణ ప్రణాళిక ను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు. అదే విధంగా ప్రవేశం మరియు నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళిక బద్దంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు.

అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ , జాయింట్ సీఈవో ఎస్.వెంకటేశ్వరరావు తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్పరెన్సు లో పాల్గొన్నారు.

Check Also

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *