Breaking News

ప‌ట్టిసీమ‌తో సిరుల సీమ‌గా కృష్ణా డెల్టా

– ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో దాదాపు 30 ల‌క్ష‌ల మందికి తాగునీరుతో పాటు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు
– దుర్బిక్ష ప‌రిస్థితులను త‌ప్పించేందుకు న‌దుల అనుసంధానం ఏకైక మార్గ‌మ‌ని
మ‌న తెలుగు బిడ్డ కేఎల్ రావు ఎప్పుడో చెప్పారు
– ఎంతో దార్శ‌నిక‌త‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు న‌దుల అనుసంధానానికి శ్రీకారంచుట్టారు
– ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌ను ప్రారంభించి కృష్ణాడెల్టా ప్ర‌జ‌ల‌కు వ‌ల‌స వెళ్లే ప‌రిస్థితి రాకుండా చూశారు
– రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి డా. నిమ్మ‌ల రామానాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దార్శ‌నిక‌త‌కు దీక్షాద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నం ప‌ట్టిసీమ అని.. ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో కృష్ణా డెల్టా సిరుల సీమ‌గా మారుతోంద‌ని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి డా. నిమ్మ‌ల రామానాయుడు అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం, ఫెర్రీ ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద ప‌ట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి నీళ్లు కృష్ణమ్మలో కలుస్తున్న సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య పూలు జల్లి చీర సారె సమర్పించి జ‌ల హారతి ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), గుడివాడ శాస‌న‌స‌భ్యులు వెనిగండ్ల రాము, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, జ‌ల‌వ‌న‌రుల శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి పాల్గొన్నారు. అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. దేశ ప్ర‌జ‌ల‌ను క‌ర‌వుకాట‌కాల నుంచి దుర్భిక్ష ప‌రిస్థితుల నుంచి కాపాడే శ‌క్తి ఒక్క న‌దుల అనుసంధానానికే ఉంటుందని మ‌న తెలుగు బిడ్డ కేఎల్ రావు ఎప్పుడో చెప్పార‌ని.. దాన్ని నిజం చేస్తూ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గోదావ‌రిని కృష్ణ‌మ్మ‌తో అనుసంధానించార‌ని పేర్కొన్నారు. బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం పూర్త‌య్యేలోపు వృథాగా స‌ముద్రంలోకి పోతున్న గోదావ‌రి జ‌లాల‌ను ఒడిసిప‌ట్టి ప‌ట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందించి.. త‌ద్వారా డెల్టా ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ‌కు ఆయ‌న ఎంతో ముందు చూపుతో కృషిచేశార‌న్నారు. జ‌లాలు వృథా కాకుండా స‌ద్వినియోగం చేసుకోవాల‌నే ఉద్దేశంతో చేసిన గొప్ప ఆలోచ‌న‌కు ప్ర‌తిరూపం ప‌ట్టిసీమ అని పేర్కొన్నారు. 24 పంపుల్లో ప్ర‌స్తుతం 17 పంపుల ద్వారా 6,100 క్యూసెక్కుల నీరు డెల్టాకు విడుద‌ల‌వుతోంద‌ని.. మిగిలిన పంపుల‌ను ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి ప‌నిచేయించి దాదాపు 8 వేల క్యూసెక్కుల నీరు అందేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప‌ట్టిసీమ‌కు రూ. 1,300 కోట్లు వెచ్చించి 2015 నుంచి నాలుగేళ్ల‌లో 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించి.. రైతుల‌కు 50 వేల కోట్ల ఆదాయం స‌మ‌కూరిందంటే అస‌లైన సంప‌ద సృష్టి ఎలా జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. నారుమ‌ళ్ల మాట అటుంచి… తాగ‌డానికి నీళ్లు ఇవ్వండి అంటూ ఇప్ప‌టికే విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు తాగునీరు, సాగునీరు అందుతున్నాయంటే అందుకు ప‌ట్టిసీమ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఆల‌మ‌ట్టి, జూరాల‌, శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్.. ఆపై కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే ఆగ‌స్టు వ‌ర‌కు ఆగాల్సి వ‌స్తుంద‌ని.. ఈలోగా ప్ర‌జ‌లకు తాగునీరు, ఖ‌రీఫ్ సాగుకు అవ‌స‌ర‌మైన సాగునీరు అందించేందుకు ప‌ట్టిసీమ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు వ‌ల‌స వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఎదురుకాకుండా సుభిక్షంగా ఉంచుతోంద‌ని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు పేర్కొన్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎంతో ముందుచూపుతో పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌య్యేలోపు ఈ ప్రాంతానికి పోల‌వ‌రం రైట్ కెనాల్ ద్వారా గోదావ‌రి త‌ల్లి నీళ్ల‌ను ఇచ్చేందుకు కృషిచేశార‌న్నారు. గోదావ‌రిని కృష్ణ‌మ్మతో అనుసంధానించేందుకు ప‌ట్టిసీమ‌ను తెచ్చార‌న్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఈ నాలుగు స్కీములను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబునాయుడు గారు ప్రారంభం చేసిన‌వేనని పేర్కొన్నారు. పట్టిసీమ నీళ్లతో తిరువూరు, నూజివీడు, మైలవరం త‌దిత‌ర ప్రాంతాల్లోని మెట్ట ప్రాంతాలన్నీ డెల్టాను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సార‌థ్యంలో, మంత్రి రామానాయుడు ఆధ్వ‌ర్యంలో జల వనరుల శాఖ మున్ముందు మ‌రెన్నో మంచి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు ప‌ట్టిసీమ ఆయువుప‌ట్టు అని.. ఈ ప‌థ‌కంతో కృష్ణా డెల్టా ప్ర‌జ‌ల‌కు తాగునీరు, సాగునీరు అందిస్తున్నందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌తంలో ప‌విత్ర సంగమం ప్రాంతం హార‌తి కార్య‌క్ర‌మాల‌తో ఎంతో క‌ళ‌క‌ళ‌లాడేద‌ని.. మ‌ళ్లీ ఈ ప్రాంతం అదే విధంగా నెల‌రోజుల్లో క‌ళ‌క‌ళ‌లాడేలా చేయాల‌ని కోరుతున్నాన‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ సి.నారాయ‌ణ‌రెడ్డి, స‌ల‌హాదారులు వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎస్ఈలు టీజేహెచ్ ప్ర‌సాద్‌బాబు, ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఇరిగేష‌న్ అధికారి పీవీఆర్ కృష్ణారావు త‌దిత‌రుల‌తో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *