Breaking News

ఇసుక లోడింగ్ ప్రక్రియలో అన్ని చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక లోడింగ్ ప్రక్రియలో ఆలస్యం లేకుండా త్వరితగతిన వినియోగదారులకు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి సృజన అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక నిల్వ పాయింట్ వద్ద జరుగుతున్న విక్రయాలు, లోడింగ్ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఇసుక విధానంలో ప్రస్తుతం నిల్వ ఉన్న ఇసుకను జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్దారించిన నామమాత్ర రుసుమును మాత్రమే వసూలు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో ఎనిమిది ఇసుక నిల్వ డిపోలైన కంచెల, మాగల్లు, కొడవటికల్లు, అల్లూరిపాడు, అనుమంచిపల్లి, పోలంపల్లి, కీసర, మొగులూరు వద్ద నుండి ఇసుక విక్రయాలు జరుగుతున్నాయన్నారు. కీసర స్టాక్ పాయింట్ వద్ద 2 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. అన్ని విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారులకు త్రాగునీరు, టెంట్ వంటి మౌలిక వసతులను కల్పించాలన్నారు. నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక, ధరలను గనుల శాఖ వెబ్ సైట్లో ఉంచడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్ర 6 గంటల వరకు ఇసుక విక్రయాలు జరపాలన్నారు. రోజు వారి ఇసుక విక్రయాలు, నిల్వ వివరాలను రాత్రి 8 గంటల లోపు గనుల శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్దారించిన టన్ను ఇసుక ధరల వివరాలను స్టాక్ యార్డ్/డిపోలలో వద్ద ప్రదర్శించాలన్నారు. ఒక వ్యక్తి రోజుకి 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. నిల్వ కేంద్రాలలో ఇసుక విక్రయ కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసిన రీసేల్ చేసిన ఇతర రాష్ట్రాలకు తరలించిన జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఒకే బ్యాంకు అకౌంట్ తో అనుసంధానమై ఉండటం వల్ల లావాదేవీలకు వినియోగించే క్యూ ఆర్ కోడ్ విషయంలో కొంత ఆలస్యమవుతున్నట్లు అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు ప్రాధమిక దశలో క్షేత్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తు త్వరితగతిన లోడింగ్ ప్రక్రియ పూర్తయేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జి. సృజన అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *