Breaking News

పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు : హిమాన్షు శుక్లా హామీ!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిబంధనలు సరళతరం చేసి పనిచేసే పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఎ.పి.యు.డబ్ల్యు.జే. నాయకులకు హామీ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకునిగా బాధ్యతలు చేపట్టిన హిమాన్షు శుక్లా ను ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకత్వ బృందం సోమవారం కలిసి అభినందనలు తెలిపింది. యూనియన్ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం , శాలువా ఇచ్చి సత్కరించారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలపై పదిహేను అంశాల వినతిపత్రాన్ని యూనియన్ నాయకత్వ బృందం ఆయనకు అందచేసింది. వినతిపత్రంలోని అన్ని అంశాల గురించి హిమాన్షు శుక్లా యూనియన్ నాయకులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన అక్రెడిటేషన్ జీవోను రద్దు చేయాలని, నిబంధనలు సరళతరం చేసి పనిచేసే జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలని యూనియన్ నాయకులు కోరారు. అందుకు హిమాన్షు శుక్లా సానుకూలంగా స్పందించారు. పాత జీవోలో ఉన్న నిబంధనలను పరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వడానికి వీలుగా నిబంధనలలో మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

2019 మార్చ్ నాటికి హెల్త్ కార్డులున్న జర్నలిస్టులందరికీ గత వారం పునరుద్ధరించిన వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీంలో అవకాశం కల్పించి వారందరికీ మళ్ళీ హెల్త్ కార్డులు జారీ చేయాలని యూనియన్ కోరింది. ఈ విషయాన్ని అధ్యయనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల వినియోగం సందర్భంగా నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఒక త్రైపాక్షిక కమిటీ ఏర్పాటు చేయాలన్న యూనియన్ సూచనకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు ప్రమాద బీమాను పునరుద్ధరించాలని యూనియన్ నాయకులు కోరారు. అందుకు హిమాన్షు శుక్లా సానుకూలంగా స్పందించారు. పాత్రికేయుల సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కారాలపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుమారు అరగంట సేపు వివిధ అంశాలపై వివరమైన చర్చ జరిగింది.

హిమాన్షు శుక్లాను కలిసిన వారిలో ఎపియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు , ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్, ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, విజయవాడ అర్బన్ శాఖ కార్యదర్శి దారం వేంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *