Breaking News

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖచే గుంటూరులో మూడు రోజుల కార్గిల్ ఫోటో ఎగ్జిబిషన్‌

-అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కార్గిల్‌ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు ఎమ్మెల్యేలు పిలుపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి భారతదేశాన్ని గొప్ప, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు, కార్గిల్ యుద్ధంలో సాధించిన చిరస్మరణీయ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌లో సమావేశమైన కళాశాల విద్యార్థులు మరియు ఎన్‌సిసి క్యాడెట్‌లను ఉద్దేశించి వారు ప్రసంగించారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి 2047 నాటికి అభివృద్ధి పరంగా భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. యువత చిత్తశుద్ధితో కృషి చేస్తేనే ఉజ్వల లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే మాధవి అన్నారు. దేశం శాంతియుతంగా ఉండేందుకు, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూసేందుకు సైనికులు ఎన్నో త్యాగాలు చేశారని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, విద్యార్థులు జీవిత పరీక్షల్లో విజయం సాధించేందుకు సన్నద్ధతను కొనసాగించాలన్నారు. జీవితానికి, కార్గిల్ యుద్ధానికి మధ్య ఉన్న సారూప్యతలను వివరిస్తూ, చారిత్రక సంఘటనలు భవిష్యత్తు తరాలకు కొన్ని పాఠాలను మిగులుస్తాయని అన్నారు. విజయంలో క్రమశిక్షణ, సంసిద్ధత కీలకమని చెప్పారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎక్సిబిషన్ లో కార్గిల్ యుద్దానికి సంబంధించిన వివిధ చిత్రాల వివరాలను వివరంగా తెలుసుకున్నారు.

ఎన్ సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్.ఎం. చంద్రశేఖర్ 1999లో కార్గిల్ యుద్ధంలో అధిక ఎత్తులో జరిగిన యుద్ధంలో సైన్యం ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. అయితే, భారతదేశం తన ఆయుధాలను మరియు యుద్ధ వ్యూహాలను ఆధునీకరించి, తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు.

పీఐబీ మరియు సీబీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యకలాపాలను వివరించారు. సవాళ్లను ఆత్మవిశ్వాసంతో స్వీకరించి, ఫలితాలను వినయంతో స్వీకరించాలని విద్యార్థులను చైతన్యపరిచారు.

దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో సైనికులు చేసిన అత్యున్నత త్యాగాలను స్మరించుకునేందుకు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీబీసీ, అందరికీ అందుబాటులో ఉండేలా మూడు రోజుల ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌సిసి క్యాడెట్లు దేశభక్తి నినాదాలతో ర్యాలీకి నాయకత్వం వహించగా, సిబిసి ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర మరియు ఎన్‌సిసి అధికారి విజయ్ మోహితే జెండా ఊపి ప్రారంభించారు. సీబీసీ వివిధ కళాశాలల్లో కార్గిల్ విజయ దివస్ సిల్వర్ జూబ్లీ థీమ్‌పై వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్ మరియు డ్రాయింగ్ పోటీలను కూడా నిర్వహించింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *