Breaking News

2047 నాటికి వికసిత్‌ భారత్‌ను సాధించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించేందుకు తీసుకొచ్చిన చారిత్రాత్మక బడ్జెట్

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో మూడోసారి విజయం సాధించడం ఆ కలను సాకారం చేస్తుంది : కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.మురుగన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 23న సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024-25 చారిత్రాత్మకమైనదని, భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాధించే దిశగా రూపుదిద్దుకుందని కేంద్ర సమాచార & ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్ అన్నారు. 2024-25 బడ్జెట్‌పై శనివారం (జులై 27, 2024) విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ రికార్డు స్థాయిలో మూడోసారి విజయం సాధించడం ఆ కలను నిజం చేస్తుందని అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మిత్రపక్షాల కూటమి అధికారంలోకి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ శక్తితో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.

2023-24లో నమోదైన 8.2% జీడీపీ వృద్ధి రేటును పునాదిగా చేసుకుని దేశాన్ని మరింత మహోన్నతంగా నిర్మించడానికి, రాబోయే రెండేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే సంస్కరణలను కొనసాగించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ మారుతుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆదాయాన్ని పెంచడానికి ఎఫ్‌డీఐ నియమాలు, విధానాలను సులభంగా మార్చారని చెప్పారు. సాంఘిక సంక్షేమ రంగానికి గత బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.23 లక్షల కోట్ల కేటాయించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు ఫలిత ఆధారిత విధివిధానాలపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలకు గణనీయంగా పెరిగిన కేటాయింపులు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తాయని డా.మురుగన్‌ చెప్పారు.

ఈ బడ్జెట్‌లో పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్‌, స్టాండ్-అప్ ఇండియా వంటి కార్యక్రమాలకు కూడా కేటాయింపులు పెంచినట్లు మంత్రి వివరించారు. ఇది, హస్తకళాకారులు, చేతివృత్తులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ/ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్, పీఎం-పోషన్‌, పీఎం-శ్రీ పథకాలకు కేటాయింపులు పెంచినట్లు వెల్లడించారు. దీనివల్ల, మౌలిక సదుపాయాలు, బోధన అభ్యాస వనరులు, పోషకాహార మద్దతును పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాధాన్యత పథకాలకు గణనీయమైన ప్రోత్సాహం అందుతుందన్నారు.

ఆరోగ్య రంగానికి గతంలోని రూ.2.5 లక్షల కోట్ల కేటాయింపులను ఇప్పుడు రెట్టింపు చేసి రూ.5.85 లక్షల కోట్లు కేటాయించామని డా.మురుగన్‌ చెప్పారు. ఆరోగ్య సంబంధిత కేటాయింపులను గత ఏడాది కంటే 13 శాతం పెంచామని, ప్రజల ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.

వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి మారతారని, ఆ ఉత్పత్తులకు ధ్రువీకరణ & బ్రాండింగ్‌ అందిస్తామన్నారు. ఈ ఏడాది వ్యవసాయం & అనుబంధ రంగాల కోసం రూ.1.52 లక్షల కోట్లతో 10,000 ‘నీడ్ బేస్డ్ బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల’ను ఏర్పాటు చేయనున్నట్లు డా.మురుగన్ తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగులో స్వయంసమృద్ధిని సాధించడానికి ఆయా పంట దిగుబడులు, నిల్వ, మార్కెటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందని చెప్పారు. ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దు తిరుగుడు వంటి నూనె గింజల సాగులోనూ స్వయంసమృద్ధి సాధిస్తామన్నారు. రైతులు, వారి వ్యవసాయ భూములను కవర్‌ చేసేలా ‘డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల’ను (డీపీఐ) రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

ఉత్పాదకతను పెంచేందుకు చేపడుతున్న వ్యవసాయ పరిశోధనలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేపడుతుందని డా.మురుగన్‌ తెలిపారు. అధిక దిగుబడినిచ్చే & వాతావరణ మార్పులను తట్టుకోగల 109 కొత్త వంగడాలను విడుదల చేస్తామని ప్రకటించారు. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ దేశంలోని తూర్పు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ‘పూర్వోదయ’ అనే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని డా.మురుగన్‌ చెప్పారు. ఇది మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వికసిత్‌ భారత్‌ను సాధించే దిశగా తూర్పు ప్రాంతాన్ని ఇంజిన్‌గా మార్చేందుకు ఆర్థిక అవకాశాలు కల్పిస్తుందన్నారు.

గతంలో తీసుకున్న ముద్ర రుణాలను తిరిగి చెల్లించిన పారిశ్రామికవేత్తలకు ఆ పథకం కింద రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. తయారీ, సేవ పరిశ్రమలను బలోపేతం చేయడానికి, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి రూ.100 కోట్ల వరకు యంత్రాలకు ఏ విధమైన తనఖా అవసరం లేకుండా క్రెడిట్ గ్యారెంటీ అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. రుణగ్రహీతలపై ఒత్తిడి లేకుండా చేసేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు టర్నోవర్‌ పరిమితిని రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు తగ్గించామని చెప్పారు. రాష్ట్రాల నేతృత్వంలో వృద్ధిని సాధించడానికి ఈ మార్పులు తీసుకొచ్చామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రకటించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దాదాపు 20 లక్షల మంది యువత వచ్చే 5 సంవత్సరాల్లో నైపుణ్యం సాధిస్తారని, 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఒక హబ్‌గా మారుస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందని యువతను దృష్టిలో పెట్టుకుని, దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణం అందజేసేందుకు ఆర్థిక సాయం ప్రకటించామని తెలిపారు. 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా పైకప్పు సౌర విద్యుత్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు విశేష స్పందన వచ్చిందని డా.మురుగన్‌ తెలిపారు.

జనాభా పెరుగుదల కారణంగా కొత్తగా అర్హత పొందిన 25,000 గ్రామీణ ప్రాంతాలకు, ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ నాలుగో దశ కింద, అన్ని వాతావరణాలను తట్టుకునే రహదార్లు నిర్మిస్తామని వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల తర్వాత ప్రత్యేక కేటాయింపులు జరిగాయన్న కేంద్ర మంత్రి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్‌ వంటివాటిని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15,000 కోట్లు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు అదనపు నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు, ప్రకాశం జిల్లాను ప్రత్యేకంగా చేర్చడం ద్వారా రాయలసీమ, ఉత్తర ఆంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం “ప్రత్యేక ఆర్థిక సాయం” అందిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించి త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సంపూర్ణంగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డా.మురుగన్ స్పష్టం చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *