Breaking News

రెండు కుల చక్రాల మధ్య నలుగుతున్న ఆంధ్ర రాజకీయం, కులగణతోనే రుగ్మతకు విరుగుడు…

-రిటైర్డ్‌ డీజీపీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఏపీ కోఆర్డినేటర్‌ డా. పూర్ణచంద్రరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్రం వచ్చి మొన్నటికి 77 ఏళ్ళు నిండినా, బీసీ కులాలకు మాత్రం, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. 1983 వరకు ఏకకుల రెడ్ల పాలన, ఆ తర్వాత కమ్మవారితో కలిపి ఇప్పటి వరకు ద్వికుల పాలనతో, ఆంధ్రప్రదేశ్‌ లో అటు ఎస్సీలు, ఎస్టీలతో పాటుగా బీసీలు, మైనార్టీలు, సంచారజాతుల వారు తీవ్రంగా నష్ఠపోయారని ఆంధ్రప్రదేశ్‌ బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ మరియు రిటైర్డ్‌ డీజీపీ డా పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడలో జరిగిన రాష్ట్రవ్యాప్త బీసీ అసెంబ్లీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ వారు కులగణన అనేది తక్షణ చారిత్రక అవసరం అని, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, చట్టసభలో వారిని అనాదిగా ఊరిస్తున్న రిజర్వేషన్ల వాగ్దానాలు నెరవేరాలంటే, కులగణనతోనే సాధ్యం అని వివరించారు. రాష్ట్రంలో దాదాపు 242 ఉపకులాలలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. జనాభాలో ఎస్సీలు దాదాపు 20 శాతం మరియు ఎస్టీలు 7 శాతం ఉన్నారు. సంఖ్యాపరంగా రెడ్ల జనాభా 6 శాతం, కమ్మలు 5 శాతం ఉండగా, పార్లమెంటు, అసెంబ్లీ, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో సీట్ల పంపకం ఎన్నడూ దామాషా ప్రకారం జరగలేదు. మరియు ఎస్సీలు, అలాగే, నామినేటెడ్‌ పదవులు, వీసీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో హెచ్‌ఓడీలు, మరీ ముఖ్యంగా న్యాయవ్యవస్థలో జడ్జీల సంఖ్యలో ఈ కులాల ప్రాతినిధ్యం స్వల్పంగానే కొనసాగుతోందన్నారు. గడచిన 16 ఎన్నికల్లో రెడ్లు 658, కమ్మ 549, ఎమ్యెల్యేలు కాగా, యాదవులు 46, గౌడ్లు (శెట్టిబలిజతో సహా) 68 మంది మాత్రమే ఎమ్యెల్యేలు కాగలిగారు. 30 బీసీ కులాలు అసలు చట్టసభల్లో లేవంటే, దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం లేదని అర్థం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాల లెక్కలు తీయాలి. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చట్టసభల్లో బీసీలకు 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అని మరొక్క ఇంద్రజాలానికి తెరతీశారు. ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి నైపుణ్య గణన అంటూ కొత్త ఆటను మనకు పరిచయం చేస్తున్నారు. కులగణన అనేది మా ప్రధాన డిమాండ్‌, అలాగే, బీసీ రక్షణ చట్టం వెనువెంటనే అమలు చేయాలి. వీటి సాధన దిశగా ఇవాళ ఈ బీసీ అసెంబ్లీ నిర్వహిస్తున్నాము. ఈ డిమాండును ఉధృతం చేసే దిశగా, వచ్చేవారం నుండీ జిల్లా, నియోజకవర్గం స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, త్వరలో మహాధర్నా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఏస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి, పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌కుమార్‌, బీఎస్పీ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ పుష్పరాజ్‌, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్‌ వందనకుమార్‌, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ వై.కోటేశ్వర రావు, ఓబీసీ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు కిరణ్‌కుమార్‌ గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షులు కే.శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *