Breaking News

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో జరిగిన ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు వేగవంతం..

-రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆధ్వర్యంలో విచారణ
-జిల్లాలోని శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు ఘటనా స్థలం సందర్శన
-దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో జరిగిన ఘటనపై అత్యంత పారదర్శకంగా దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు దాగి ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు శుక్రవారం ఉదయం రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, న్యాయమూర్తి గాయత్రి దేవి, పెడన, పామర్రు, గన్నవరం శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ శాసన సభ్యులు రావి వెంకటేశ్వరరావు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మంత్రి కొల్లు రవీంద్ర జరిగిన ఘటనపై మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో కెమెరాలున్నాయనే ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనా స్థలికి వెళ్లి సమస్యను పరిశీలించాలని ఆదేశించారని తెలిపారు.

ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరం. పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఐదుగురు మహిళా అధికారుల బృందాన్ని నియమించిందన్నారు. ఏవైనా రికార్డింగ్స్ సెల్ ఫోన్లలో ట్రాన్స్ ఫర్ అయ్యాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్దారణకు రాలేదని, అనుమానాలున్న మాట వాస్తవమేనని మంత్రి తెలిపారు. ఆడ పిల్లల విషయంలో తప్పు చేయాలంటే భయపడేలా బాధ్యులపై చర్యలుంటాయని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

కళాశాల విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సంరక్షణ కల్పిస్తామని అందులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తమకు ఎట్టి పరిస్థితుల్లోనైనా న్యాయం జరగాలని అంతవరకు కళాశాలకు వెళ్ళమని విద్యార్థులందరూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్ గాని, కళాశాల యాజమాన్యం పైన గాని క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడే ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, మరలా ఇటువంటి సంఘటనలు జరగకుండా భయపడే విధంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, గత మూడు రోజులుగా ఈ సంఘటన తెలిసినప్పటికీ యాజమాన్యం తొక్కి పెడుతూ ఉందని, ఈ సంఘటన విషయమై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు వుంటాయని కళాశాల యాజమాన్యం బెదిరించారని విద్యార్థులు మంత్రి, అధికారుల దృష్టికి తెచ్చారు.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, మంత్రి, ఎస్పీ, జిల్లా శాసన సభ్యులతో కలసి కళాశాల ప్రిన్సిపాల్ బొర్రా కరుణ కుమార్, సహా కార్యదర్శి రామకృష్ణతో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమై చర్చించారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని సూచించారు. పరీక్షలకు హల్ టికెట్లు ఇవ్వకపోవడం లేదా సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడం లాంటివి చెయ్యొద్దని సూచిస్తూ కళాశాల యాజమాన్యం చేత అక్కడిక్కడే విద్యార్థులకు సర్క్యులర్ జారీ చేయించారు. జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందులో అందరూ మహిళా పోలీసు అధికారులే ఉన్నారన్నారు. గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ. రమణమ్మను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. ఆమెతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐటీ కోర్ ఎస్సై మాధురి, కమ్యూనికేషన్ పోలీస్ సిబ్బంది నలుగురుతో కలిపి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు.

ఈ విచారణ శాస్త్రీయబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రస్తుతానికి ఎవరైతే బాధ్యులుగా విద్యార్థిని, విద్యార్థి పేరు చెబుతున్నారో వారి సెల్ ఫోను, లాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నామని దాంట్లో ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్ను శాస్త్రీయబద్ధంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. దాంట్లో ఏ చిన్న మెటీరియల్ గాని ఏ వీడియో గాని ఉన్న యెడల దాన్ని గమనించి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవి ఎంత తీవ్రంగా చర్యలు ఉంటాయంటే అలాంటి పనులు ఇకమీదట ఎవరు చేయడానికి సాహసించకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ విచారణ ఎన్ ఎల్ జె డి( నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్) పరికరం ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా పోలీసు యంత్రాంగానికి కొంత వెసులుబాటు కల్పిస్తే అన్ని విధాల పరిశీలించి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. కళాశాల మొత్తాన్ని ఏమైనా రహస్య కెమెరాలు ఉన్నాయేమో తనిఖీ చేస్తామన్నారు. రహస్య కెమెరాలపై ఏ విద్యార్థికైనా ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

అనంతరం బాలికల వసతి గృహంలో విచారణ ప్రత్యేక అధికారి సీఐ రమణమ్మ, ఎస్సై పూర్ణ మాధురి నేతృత్వంలో పోలీసు బృందం 10 మంది విద్యార్థినులతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి స్నానపు గదుల్లో తనిఖీకి వెళ్లారు.

తనిఖీ అనంతరం వారు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారులను కలిశారు.

ఈ సందర్భంగా బాలికల వసతి గృహం వద్ద విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థినులకు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి విద్యార్థినులకు భరోసా కల్పించారు. బాలికల వసతి గృహంలో ప్రతి ఫ్లోర్ కు మహిళా కానిస్టేబుల్లను ఇన్చార్జులుగా నియమిస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్రావు విద్యార్థులకు తెలిపారు. విచారణ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థినులకు చెప్పారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *