Breaking News

10 రోజుల్లోనే వాహ‌నాల‌కు బీమా మొత్తం అందేలా చ‌ర్య‌లు

– ఇన్సూరెన్సు లేని వాహ‌నాల‌కు ఏ విధంగా సాయం చేయాలో చూస్తున్నాం.
– దెబ్బ‌తిన్న వ్యాపారులను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం.
– ఫైర్ ఇంజిన్ల‌తో పెద్దఎత్తున ఇళ్ల‌ను శుభ్రంచేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం.
– బుడ‌మేరుకు ప‌డిన రెండు గండ్లు పూడ్చాం. మ‌రోదాన్ని రేప‌టిక‌ల్లా పూడుస్తాం.
– బియ్యంతో పాటు మ‌రో అయిదు వ‌స్తువుల కిట్‌ను ప్ర‌తి ఇంటికీ అందిస్తాం
– రాయితీపై కూర‌గాయ‌ల‌ను అందిస్తాం
– మీడియా స‌మావేశంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలావ‌ర‌కు వాహ‌నాలు దెబ్బ‌తిన్నాయి. కొన్ని వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉంది. మ‌రికొన్ని వాహ‌నాల‌కు ఇన్సూరెన్సు లేదు. వీటిని విశ్లేషించి రెండు కేట‌గిరీలుగా విభ‌జించాం. ఇందులో మొద‌టిది ప‌ది రోజుల్లో ఇన్సూరెన్స్ ఇప్పించ‌డం. దీన్నో ప్ర‌ధాన బాధ్య‌త‌గా పెట్టుకున్నాం. రెండోది ఎవ‌రైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకు రుణాలు తెచ్చుకున్న‌వారు గానీ, వారు సొంతంగా డ‌బ్బులు పెట్టుకున్న వారుగానీ చాలావ‌ర‌కు న‌ష్ట‌పోయారు. ప‌ల్ల‌పు ప్రాంతాల్లో ఉన్న షాపులు బాగా పోయాయి. వాటిలో ఉన్న ప్రొడ‌క్ట్‌ల‌ను పూర్తిగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితికి వ‌చ్చారు. వారంద‌రికీ ఆస‌రా క‌ల్పించాలి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో రుణాల తిరిగి చెల్లింపులో వ‌డ్డీ రాయితీ, ప్రిన్సిప‌ల్ అమౌంట్‌లో కొంత త‌గ్గింపు, ఇన్‌స్టాల్‌మెంట్స్ పెంపు త‌దిత‌రాల‌పై ఆలోచిస్తున్నాం. ఓ వ్య‌క్తి రూ. 25 ల‌క్ష‌లు పెట్టి వ్యాపారం పెడితే రూ. 25 ల‌క్ష‌ల స‌రుకు పోయుంటే రూ. 25 ల‌క్ష‌ల‌కు వ‌డ్డీ క‌డుతూ మ‌ళ్లీ వ్యాపారం చేయ‌డానికి పెట్టుబ‌డి పెట్టాలి.. ఇది చాలా భార‌మ‌వుతుంది. అలాంటి వారికి ఎలా స‌హాయం చేయాల‌నే దానిపై యోచిస్తున్నాం. ఇళ్ల‌ల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఒక స్ట‌వ్వో, ఏసీనో, ఫ్రిజ్ ఇలా వివిధ వ‌స్తువులు పోయాయి. బ‌ట్ట‌లు, ఫ‌ర్నిచ‌ర్ వంటివీ పాడ‌య్యాయి. ఇలాంటి దానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. మొద‌ట‌గా ఈ రోజు బ్యాంకు అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించాం. రుణాల రీషెడ్యూల్ లేదా రుణ భారం త‌గ్గించ‌డం.. ఇలా ఏం చేయ‌గ‌లుగుతామో సీరియ‌స్‌గా ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్నాం. రేప‌ట్నుంచి చ‌ర్చ‌ల్లో చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వంటి అసోసియేష‌న్ల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తాం.

ఆహార స‌ర‌ఫ‌రాలో గరిష్టంగా 82 శాతం రేటింగ్‌:
ఆహారం రోజులో మూడుసార్లు ఇస్తున్నాం. ఈ రోజు రేటింగ్ కూడా బాగా వ‌చ్చింది. గ‌రిష్టంగా 82 శాతం, క‌నిష్టంగా 72 శాతం వ‌చ్చింది. మొత్తంమీద అధికారులంద‌రూ ప్ర‌తికూల ప్రాంతాల్లో స్ట్ర‌గుల్ అవుతున్నారు. నీరు బాగా ఉండే ప్రాంతంలో అక్క‌డి స్టాఫ్ కూడా నిర్వీర్యం అయిపోయింది. స‌చివాల‌యాలు కూడా ప‌నిచేయ‌లేని ప‌రిస్థితులున్నాయి. ఇలాంటి ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీ పెద్ద ఎత్తున అంద‌రూ బాగా ప‌నిచేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. ప్ర‌జ‌ల‌ను కూడా మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి నుంచి కూడా స‌రైన విధంగా ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. అన్ని స‌చివాల‌యాల్లో వ‌చ్చే స‌మాచారాన్ని తీసుకుని ముందుకెళ్తున్నాం. నిత్యావ‌స‌ర స‌రుకులు ఇస్తే మేము వంట చేసుకుంటామ‌నే పీడ్ బ్యాక్ కొంద‌రి ద‌గ్గ‌రి నుంచి వ‌స్తోంది. దీన్ని కూడా ప‌రిశీలిస్తాం. ఎక్క‌డైతే నీళ్లు లేవో రేపు ఒక ప్యాకేజీ ఇస్తున్నాం. 25 కిలోల బియ్యం, కేజీ ప‌ప్పు, లీట‌ర్ పామాయిల్‌, బంగాళా దుంప‌లు రెండు కిలోలు, ఉల్లి రెండు కిలోలు, చ‌క్కెర కిలో ప్ర‌తి ఒక్క ఇంటికీ ఇస్తాం. బీపీఎల్‌, ఏపీఎల్ అనే తేడా లేకుండా అంద‌రికీ ఇస్తాం. గురువారం భోజ‌నం, పాలు, నీరు ఇస్తాం. రేపు సాయంత్రం నాటి ప‌రిస్థితుల‌నుబ‌ట్టి ఆహారం స‌ర‌ఫ‌రా ప‌రిమాణంలో మార్పులు చేస్తాం. ఎల్లుండు 50 శాతానికి అందిస్తాం. 50 శాతానికి బియ్యం వంటివి ఇచ్చిన త‌ర్వాతే నీళ్లు ఎక్కువ‌గా ఇస్తాం. వారే వంట చేసుకునేలా స‌హాయ‌మందిస్తాం.

పారిశుద్ధ్య చ‌ర్య‌ల్లో కీల‌కంగా ఫైర్ ఇంజిన్లు:
ఈరోజు ఫైర్ ఇంజిన్లు బాగా ప‌నిచేస్తున్నాయి. ఒక్కో ఇంజిన్ రోజుకు 250 ఇళ్లు క్లీన్ చేయ‌గ‌లుగుతాయి. రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో ప‌నిచేసేలా చూస్తాం. రెండుమూడు రోజుల్లో పూర్తిచేయాల‌ని చూస్తున్నాం. పొడి ప్రాంతాల్లో ముందు చేసి త‌ర్వాత నీరు ఉండే ప్రాంతంలో చేస్తాం. ట్యాంక‌ర్ల‌ను బాగా పెంచుతున్నాం. ఎక్క‌డా నీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అదే స‌మ‌యంలో మిన‌ర‌ల్ వాట‌ర్ కూడా స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. ఇదికాకుండా టెలీ క‌మ్యూనికేష‌న్ కనెక్టివిటీని క‌చ్చితంగా చేయాల‌నుకున్నాం. అంద‌రికీ చెప్పాం. దీనికి సంబంధించి స్ప‌ష్టంగా ఆదేశాలిచ్చాం. రాత్రికే చాలా ప్రాంతాల్లో క‌రెంటు వ‌చ్చింది. రేపు ఉద‌యానికి చాలా వ‌ర‌కు ఇస్తాం. కొద్దిప్రాంతాలు త‌ప్ప మిగిలిన అన్ని ప్రాంతాల‌కు రేపు సాయంత్రానికి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రిస్తాం. పెద్దఎత్తున చెత్తాచెదారం తొల‌గింపున‌కు వాహ‌నాలు పెట్టాం. ప్ర‌య‌త్నంలో ఎలాంటి లోపం లేకుండా ఎన్ని విధాలా ఆలోచించాలో అన్ని విధాలా ఆలోచించి సాధార‌ణ స్థితికి ప‌రిస్థితిని తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం.

రెండు బుడ‌మేరు గండ్లు పూడ్చాం..
బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డితే వాటిలో రెండు ఇప్ప‌టికే పూడ్చాం. ఉద‌యం నుంచి మంత్రులు నారా లోకేష్‌, రామానాయుడు అక్క‌డే ఉన్నారు. మిగిలిన గండిని ఈ రోజు రాత్రికిగానీ రేపు ఉద‌యానికి గానీ పూడ్చేప‌ని పూర్తిచేస్తాం. బుడ‌మేరుకు ఎక్కువ నీళ్లు వ‌స్తున్నాయ‌ని కొంద‌రు వ‌దంతులు వ్యాప్తి చేస్తున్నారు. నీళ్లు ఎక్కువ‌గా రావ‌డం లేదు. నిన్న వ‌చ్చిన నీళ్లే ఉన్నాయి. పెద్ద ప్ర‌మాదం లేదు. అనివార్య ప‌రిస్థితుల్లో ఎక్కువ నీరు వ‌స్తే ఏమిచేయాల‌నే దానిపై ఇప్ప‌టి నుంచే ఆలోచిస్తున్నాం. అవ‌స‌ర‌మైతే కొల్లేరుకు ఆ నీరు పోవ‌డానికి ఏం చేయాలో చూస్తాం.

ప్ర‌జా మ‌ద్ద‌తు శుభ ప‌రిణామం:
ప్ర‌జ‌ల నుంచి కూడా మాకు చాలా మ‌ద్ద‌తు వ‌స్తోంది. ఇది శుభ ప‌రిణామం. సీఎం రిలీఫ్ కు విరాళాలు ఇవ్వ‌మ‌ని మేము విజ్ఞ‌ప్తి చేశాం. ఉన్న‌ప‌ళంగా 2,969 మంది స్పందించి విరాళాలు ఇచ్చారు. రోజులో 99 ల‌క్ష‌ల 25 వేల 212 రూపాయ‌లు విరాళంగా అందింది. వీరిలో వెయ్యిలోపు విరాళాలు అందించిన‌వారు 1,528 మంది కాగా వీరు రూ. 3,28,161 ఇచ్చారు. 1001-10,000 వ‌ర‌కు 1169 మంది విరాళాలు అందించారు. వీరిద్వారా రూ. 28,09,822 అందింది. ప్ర‌జ‌లుక‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు. ఇదే స్ఫూర్తి అంద‌రికీ రావాల్సిన అవ‌స‌ర‌ముంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్ర‌జ‌లు అస‌హ్యించుకునే ప‌రిస్థితికి వ‌చ్చారు. ఇది మంచి ధోర‌ణి. ప్ర‌జ‌లు క‌రెక్టుగా ఆలోచించి నిర్మోహ‌మాటంగా వ్య‌వ‌హ‌రించ‌గ‌లిగితే మంచిని మంచి అని చెప్ప‌గ‌లిగితే, చెడును చెడు అని ఖండించ‌గ‌లిగితే ఆటోమేటిక్‌గా మంచి చేసే వారి సంఖ్య పెరుగుతుంది. చెడు చేసే వారి సంఖ్య త‌గ్గుతుంది. చెడు చేసే వారికి ప్ర‌జా జీవితంలో చోటులేకుండా చేస్తే అరాచ‌కాల‌నేవి ఉండ‌వు. నాలుగు రోజులుగా రాత్రింబ‌వ‌ళ్లు నాతో పాటు సీనియ‌ర్ అధికారులంద‌రినీ ఫీల్డ్‌కి పంపించాం. సిసోడియా వంటి సీనియ‌ర్ అధికారులు క్షేత్ర‌స్థాయిలో పోటీప‌డి ప‌నిచేశారు. అల‌వాటు తెచ్చుకొని బుర‌ద‌లో ప‌నిచేసి త‌ద్వారా బాధితుల‌కు సేవ‌లందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవ‌కాశం. ఒక నిబ‌ద్ధ‌త‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఎలాంటి స‌మ‌స్య రాకూడ‌ద‌ని ప‌నిచేస్తున్నారు. ఆహారం, నీరు వంటివి అందిస్తున్నారు. బ‌య‌టినుంచి వేలాది మంది వ‌చ్చి మేము కూడా సేవ చేస్తామ‌ని అంటున్నారు. ఎక్క‌డినుంచో మీరు ఆహారం తేవ‌డం.. అది స‌రిగా లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందువ‌ల్ల ద‌య‌చేసి అలాంటివి తేవొద్దు. ఒక‌వేళ తేవాల‌నుకుంటే ప‌ప్పు ధాన్యాలు వంటి డ్రై ఫుడ్ తీసుకురండి. అవికూడా ఉప‌యోగించుకునేలా తీసుకురండి. లేదంటే సీఎం రిలీఫ్‌కు విరాళాలు అందించండి. ఆ మొత్తాన్ని బాధితులకు సేవ‌చేసేందుకే ఉప‌యోగిస్తాం. ఎక్క‌డెక్క‌డినుంచో సేవ చేయాల‌నుకొని ఇక్క‌డికి వ‌స్తున్నారు.

ప్ర‌జా నాయ‌కునికి సేవా గుణం ఉండాలి:
*ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే వారిని గాలికొదిలేసి విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపిన వ్య‌క్తికి మ‌న గురించి మాట్లాడే అర్హ‌త లేదు. బాప‌ట్ల‌లో వ‌ర‌ద‌లొస్తే రెడ్ కార్పెట్ వేసుకొని న‌డిచిన‌వ్య‌క్తి. ఇప్పుడు నేను బుర‌ద నీటిలో తిరిగాను కాబ‌ట్టి బుర‌ద‌లోకి వ‌చ్చారు. ప్ర‌జా నాయ‌కుడు అనేవానికి సేవా గుణం ఉండాలి. వారికి స్ప‌ష్ట‌త లేదు, నాలెడ్జ్ లేదు. నేర్చుకోవాల‌నే ఆలోచ‌న లేదు. సాయంత్ర‌మైతే గ‌ళ్లాపెట్టి వ‌ద్ద‌కొచ్చి క‌లెక్ష‌న్ ఎంత వ‌చ్చిందో చూసుకుంటారు.

మూడు రేట్ల‌లో కూర‌గాయ‌లు:
కొంద‌రు కూర‌గాయ‌లు రేట్టు పెంచేస్తున్న‌ట్లు మా దృష్టికి వ‌చ్చింది. అందుకే కూర‌గాయ‌ల‌కు రెండు రూపాయ‌లు, అయిదు రూపాయ‌లు, ప‌ది రూపాయ‌లు అనే మూడు రేట్ల శ్లాబులు పెట్టాం. ఆకు కూర‌ల‌ను రాయితీపై రూ. 2కే ఇస్తాం. అదే విధంగా రూ. 10, రూ. 15, రూ. 20 విలువైన కూర‌గాయ‌ల‌ను రూ. 5కే ఇస్తాం.
రూ. 25, రూ. 30 చేసేవాటిని రూ. 10కే ఇస్తాం. ఈ మూడు రేట్ల‌కే కూర‌గాయ‌లు అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *