Breaking News

వరద బాధితులకు అండగా ఉంటాం..

-పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
-ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, రెండేసి కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అధిక వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ముంపు బారిన పడిన ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం సాయంత్రం మచిలీపట్నం నగరం 50వ డివిజన్ లోని సుందర్ నగర్, డ్రైవర్స్ కాలనీ, గుమస్తాల కాలనీల్లో మంత్రి పర్యటించారు. ముంపుకు గురైన కాలనీల్లోని నీటిని కొన్ని రోజులగా మోటార్ ఇంజన్లతో బయటకు తోడుతుండగా అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. స్థానిక అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా నగరంలోని లోతట్టు కాలనీలు ముంపుకు గురయ్యాయని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన నీటి తరలింపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొస్తామన్నారు. బలహీనంగా ఉన్న శివగంగ డ్రైనేజీ కట్టను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అధిక వర్షాలకు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, పంటలతో పాటు దెబ్బతిన్న ఇళ్లకు త్వరలోనే ఎన్యుమరేషన్ చేపట్టి రైతులను, బాధితులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, రెండేసి కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు పంపిణీ చేస్తామన్నారు. పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని లంకల గ్రామాలు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో నెక్కలం తదితర పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యి ఇళ్లల్లోకి నీరు చేరినట్లు తెలిపారు. వీరందరికీ సురక్షిత ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి సమయాలలో భోజనం ఏర్పాట్లు చేశామని, తాగునీరు ఇతర వసతులు కల్పించినట్లు తెలిపారు.

విజయవాడలోని తాజా పరిస్థితులను మంత్రి వివరిస్తూ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలలోని ఇళ్లు, రోడ్లు బురదమయంగా తయారయ్యాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అగ్నిమాపక యంత్రాలతో వాటన్నిటిని శుభ్రం చేయించి అక్కడి పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ పర్యటనలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *