మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళం అందించేందుకు పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కానూరుకు చెందిన షామిరాక్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసికట్టుగా 3 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుమన్ త్యాగరాజ్ జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ తమ పాఠశాల విద్యార్థులు చేనేత వస్త్రాలు, కూరగాయలు విక్రయించడం ద్వారా తమ తల్లిదండ్రుల దగ్గర నుండి సేకరించిన ఒక లక్ష రూపాయల మొత్తానికి పాఠశాల యాజమాన్యం మరో 2 లక్షల రూపాయలు జోడించి మొత్తం మూడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం జిల్లా కలెక్టర్ కు అందజేస్తున్నామన్నారు.
అందుకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చాలా నష్టం వాటిల్లిందని, వరద బాధితులను ఆదుకునే సత్సంకల్పం తో పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం ముందుకు రావడం అభినందించదగ్గ విషయం అన్నారు. వారు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కలెక్టర్ కొనియాడారు. ఆ బ్యాంకు చెక్కును ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ డిఆర్ఓ శ్రీదేవికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు మౌనిక సుమన్, ప్రిన్సిపాల్ భారతి, వైస్ ప్రిన్సిపాల్ తుషార, విద్యార్థులు ధర్ష,అండ్రియా, గుర్మన్, అర్జున్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News