అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరుతారు. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనపు విక్రమ్, డా.అవనపు భావన జనసేనలో చేరతారు. వైసీపీ యూత్ జోనల్ ఇంఛార్జ్ గా అవనపు విక్రమ్ ఉన్నారు. డా. భావన విజయనగరం, పార్వతీపురం జిల్లాల డి.సి.ఎం.ఎస్. చైర్ పర్సన్ గా ఉన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డా.యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్.పి.టి.సి. డా.యాదాల రత్నభారతి పార్టీలో చేరనున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువా వేసుకొంటారు. శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో కిలారి రోశయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆనంతరం సామినేని ఉదయభాను భేటీ అయ్యారు.