-తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. కూటమి ప్రతీకార రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధిని విస్మరించిందని ఆయన మండిపడ్డారు. అమరావతి పరిధిలో దళితుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. అసైన్డ్ భూములు దళితులకే చెందాలనే మంచి ఉద్దేశంతో తమ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ పోరాటం చేస్తుంటే, ఆయనపై అనేక రకాల కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని ఎంపీ విమర్శించారు. ఇందుకు సంబంధించి నందిగం సురేష్ సతీమణి బేబిలత, అలాగే ఆయన సోదరుడు కలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణిపై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఏపీకి వచ్చి విచారిస్తామని ఎస్సీ కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చినట్టు తిరుపతి ఎంపీ తెలిపారు.
సుప్రీంలో కూటమి సర్కార్‌కు చెంపదెబ్బలు
తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చెంప దెబ్బ కొట్టినట్టైందని ఆయన అన్నారు. చివరికి దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం బాధ్యతా రాహిత్యమని చంద్రబాబుకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని ఆయన అన్నారు. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా, ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని గురుమూర్తి తెలిపారు.
లడ్డూ ప్రసాదంలో వాడని నెయ్యిని వాడి కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించడం దుర్మార్గమన్నారు. అలాగే చంద్రబాబు వేసిన సిట్ దర్యాప్తు నివేదిక ఎలా వుంటుందో అందరికీ తెలుసన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తిరుమల పవిత్ర దెబ్బతీసేలా ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ కోరారు.