Breaking News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళిక
-కొత్త డయాఫ్రం వాల్, ఈసిఆర్ఎఫ్ డ్యాం పనుల ప్రారంభం, పూర్తి చేసే సమయంపై చర్చ
-1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు
-పోలవరం ఫలాలు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-సమస్యలను అధిగమించి…..సమన్వయంతో నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు, నిర్మాణ సంస్థలకు సిఎం సూచన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి పనులు ప్రారంభిచేందుకు గత నాలుగు నెలలుగా తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ దశల్లో రావాల్సిన అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సమస్యలు, సవాళ్లపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పనులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈసిఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 2 పనుల్లో డీవాటరింగ్ పనుల పురోగతిని వివరించారు. ఇక్కడ చేపట్టిన డీ వాటరింగ్ పనుల ద్వారా డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి అనువైన పరిస్థితి ఏర్పడిందని అధికారులు వివరించారు. డయాఫ్రం వాల్ డిజైన్ల అనుమతి కోసం గత నెల 24 తేదీన సిడబ్ల్యుసికి పంపినట్లు అధికారులు తెలిపారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ పొడవు 1,396 మీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డిజైన్లకు అనుమతులు వస్తే జనవరి నుంచి పనులు ప్రారంభించవచ్చని తెలిపారు. 1,396 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉందని తెలిపారు. కొన్ని చోట్ల 10 మీటర్ల లోతులో….కొన్ని చోట్ల 90 మీటర్ల పైగా లోతులో డయాఫ్రం వాల్ నిర్మాణంచేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు. మొత్తంగా 63,356 స్వ్కేర్ మీటర్ల ఏరియాలో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. డయాఫ్రం వాల్, ఈసిఆర్ఎఫ్ పనులు సమాంతరంగా చేయడానికి సిడబ్లుసి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై రేపటి నుంచి 9వ తేదీ వరకు పోలవరంలో జరిగే వర్క్ షాప్ అనంతరం క్లారిటీ వస్తుందని అధికారులు తెలిపారు. సిడబ్ల్యుసితో చర్చలు జరిపి డయాఫ్రం వాల్ పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సిఎం సూచించారు. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెడితే 24 నెలలు పడుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సమాంతరంగా పనులు చేపడితే 2027 జూలై నాటికి, విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధిలు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యత కూడా ముఖ్యమని….నిబంధనలకు అనుగుణంగా, ఎక్కడా డీవియేషన్ అనేది లేకుండా పనులు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించారు. అదే విధంగా ఇప్పటి వరకు 77 శాతం పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి అయ్యాయని…రూ.960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని….డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించి…..2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 లో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.7,213 కోట్లు అవసరం అని అధికారులు వివరించారు. ఫేజ్ 1 పూర్తికి ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్ నాటికి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి ఆర్ అండ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు ఈ పనులు కూడా సమాంతరంగా జరగాలని సిఎం అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన నిధులు ఎప్పడికప్పుడు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా…ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశాన్నీ చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు నాడు అనుకున్న విధంగా పోలవరంపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సిఎం సూచించారు. మరోవైపు కాలువ కట్టలను కూడా బలోపేతం చేసుకుని నీటి తరింపునకు సిద్ధం చేయాలని అన్నారు. పవర్ ప్రాజెక్టు పనులు కూడా ముందుగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలని సిఎం నిర్మాణ సంస్థను ఆదేశించారు. పోలవరం పనులు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే పొందాలని అన్నారు. ఈ నెలలో పోలవరం సందర్శనకు వచ్చి…..పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని సిఎం అన్నారు.

చింతలపూడి లిఫ్ట్ పనులు వేగవంతం
అనంతరం చింతపూడి లిఫ్ట్ పనులపైనా సీఎంకు అధికారులు వివరించారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా….ఆ పనులు పూర్తి చెయాలని సిఎం సూచించారు. అనంతరం వెలిగొండ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఇంకా రూ.2,200 కోట్ల విలువైన పనులు పెండింగ్ లో ఉండగానే వెలిగొండ పూర్తి అంటూ నాడు జగన్ ప్రారంభించాడని మంత్రి రామానాయుడు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు అందాలంటే ఇంకా రూ.2,211 కోట్ల నిధులు, రెండేళ్ల కాలపరిమితి అవసరం ఉంటుందని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని…దీనికి అవసరమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. గోదావరి పెన్నా లింకేజ్ పనులకు అవసరమైన భూసేకరణ పనులు చేపట్టాలని సిఎం సూచించారు. సమీక్షకు మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ పనులు చేస్తున్న మేఘా, బావర్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎపి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *