-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో హాకర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలోని చిరువ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. కక్షసాధింపులతో పలుచోట్ల దుకాణాలను బుల్డోజర్స్ తో కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని.. అంతేగానీ బడుగు, బలహీన వర్గాల పొట్టకొట్టడం సమంజసం కాదన్నారు. విజయవాడ నగరం రాష్ట్రానికి నడిబొడ్డున ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు మధ్య కేంద్రంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కమర్షియల్ జంక్షన్ గా ఉండే బెజవాడకు ఉపాధి కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడా హాకర్లు రోడ్ల ప్రక్కన వ్యాపారం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. లెనిన్ సెంటర్, బీఆర్టీఎస్ రోడ్డు, బుడమేరు వంతెన వద్ద, కండ్రిక, ప్రకాష్ నగర్లలో దుకాణాలను చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి శరాఘాతంగా మారుతున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళితే., గన్నవరం నుంచి విమానాలలో విశాఖ వెళితే పండుగలా సంబరాలు చేసుకునే ఈ ప్రభుత్వానికి.. పేదల ఆకలి కేకలు మాత్రం ఎందుకు పట్టవని ప్రశ్నించారు. ఆడంబరాలపై ఉన్న శ్రద్ధ.. పేదల సంక్షేమంపై ఎందుకు ఉండదని దుయ్యబట్టారు. వీలైతే ఆన్ లైన్ విధానం ద్వారా ఆధార్ అనుసంధానంతో హాకర్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి కానీ కొత్త సమస్యలను సృష్టించకూడదని సూచించారు. తాము అధికారంలో ఉండగా చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాలను జగనన్న తోడు పథకం ద్వారా ఆదుకున్నామని మల్లాది విష్ణు తెలిపారు. బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని రూ. 10 వేలు వడ్డీ లేని రుణాలు అందజేసి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపామన్నారు. కానీ ఈ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామ్యంగా ఉండి కూడా చిరువ్యాపారుల పొట్టకొడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలు, వీఎంసీ అధికారుల దౌర్జన్యంపై కౌన్సిల్ సమావేశంలో కచ్చితంగా నిలదీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.