-బిసి విద్యార్థులకు ప్రత్యేకమైన ఏపి స్టేట్ స్టడీ సర్కిల్ ఏర్పాటు
-అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ
-డా. ఏ. మల్లిఖార్జున, సంచాలకులు, బిసి సంక్షేమ శాఖ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యుపిపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కొరకు అర్హత గల బిసి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ సంచాలకులు డా. ఏ. మల్లిఖార్జున ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేకమైన ఏపి స్టడీ సర్కిల్ బిసి భవన్ గొల్లపూడి విజయవాడ నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికైన 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. అభ్యర్థులను రిజెర్వేషన్ ప్రకారం బిసి 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% ప్రకారంఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు శిక్షణ ప్రాంగణంలో ఉచిత బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బిసి, ఎస్సి, ఎస్టీ కమ్యూనిటీ లకు చెందిన సమర్ధవంతమైన అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు. దరఖాస్తులను జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం నందు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కుల జాబితా, విద్యార్హత వివరాలు (డిగ్రీ వివరాలు) కమ్యూనిటీ (కుల ధ్రువీకరణ పత్రం) మొదలైన ధ్రువపత్రాల నకళ్ళు సమర్పించాలి. రెండు పాస్ పోర్టు ఫోటోలను దరఖాస్తుకు జత చేయాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 27వ తేదీన నిర్వహించబడుతుందన్నారు. ఉచిత కోచింగ్ ప్రారంభ తేదీతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ యొక్క వేదిక మరియు సమయాలు తదుపరి తేదీలలో తెలియజేయబడతాయన్నారు. సివిల్ సర్వీసు ఎగ్జామినేషన్ రంగంలో ఎంపిక చేసిన ప్రముఖ కోచింగ్ ఇన్సిట్యూట్ సహకారంతో ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని అర్హత గల బిసి, ఎస్సి, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని డా. ఏ. మల్లిఖార్జున, సంచాలకులు, బిసి సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News