Breaking News

కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని, అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగు పర్చడంతో పాటు సిబ్బందినికూడా సమకూర్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆదివారం ఉదయం 10.20 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది సగటున 48 వేల మంది కేన్సర్ మహమ్మారి బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్ల నివారణకై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంతో పాటు కేన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి ముందస్తు వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతో దాదాపు 5 కోట్ల 30 లక్షల మందికి స్క్రీనింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. ఇందుకై ఇంటింటి సర్వే నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను హోమీ బాబా కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి నియంత్రణకు ఆరోగ్యశ్రీ పథకం క్రింద గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.600 కోట్లను వెచ్చినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు రాష్ట్రీయ బాలల స్వాస్త్య కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని 18 సంవత్సరాలలోపు విద్యార్థులు అందరికీ స్క్రీనింగ్ చేసే ఫైల్ పై మరో సంతకం చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తూ వాటికి బానిసలు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ కు బానిసలు అయిన యువతలో మార్పుతెచ్చేందుకు డిఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

అత్యంత ప్రధాన మైన ఆరోగ్య రంగాన్ని గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేసిందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు పలు కేంద్ర ప్రాయోజిక పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎటు వంటి వాటా ఇవ్వకుండా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారన్నారు. ఈ విషయంలో కోర్టులు మొట్టికాయలు మొట్టినా, కేంద్రం పెనాల్టీ వేసినా గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య దోరణిలో వ్యవహరించిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా నీరుగార్చే విధంగా అమలు పర్చారన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోకుండా అనుబంద ఆసుపత్రులను అభివృద్ది పర్చకుండా, మౌలిక వసతలు కల్పించ కుండా తొందరపాటు చర్యగా రాష్ట్రంలో వైద్య కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎంతో చిత్తశుద్ది, జవాబుదారీతనంతో పనిచేసే ప్రభుత్వాలు వచ్చాయని, ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ రాష్ట్రాభివృద్దికి తద్వారా దేశాభివృద్దికి శక్తి వంచ లేకుండా కృషిచేస్తాయని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అభివృద్దిలో అన్ని స్థాయిలోని అధికారులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్…
ఆదివారం ఉదయం 10.20 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను, అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు, ఏపి ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సి.ఇ.ఓ. లక్ష్మీషా , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా.పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.నరశింహం , ఆరోగ్య విశ్వవిద్యాలయం వి.సి. బాబ్జీ, రిజిస్ట్రారు రాధికా రెడ్డి తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *