-రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ప్రతి ఇంట్లోను మహిళలు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి. వసంత బాల తెలిపారు. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం హాల్‌లో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW) న్యూఢిల్లీ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ మధ్యాహ్నం సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి. వసంత బాల మాట్లాడుతూ పలు రకాలైన హింసలు మహిళు ఎదుర్కొంటున్నారని అందులో గృహ హింస, లైంగిక హింస, పని ప్రదేశంలో లైంగిక హింస, వరకట్న హింస, కించపర్చే హింస, మహిళల పట్ల క్రూరత్వం, మాన భంగాలు, వరకట్న మరణాలు, మహిళల అక్రమ రవాణా తదితరమైన ఉన్నాయని వాటిని అరికట్టాలన్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మహిళలను పలు విధాలుగా హింసించటం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో హింసను మహిళలు ఏవిధంగా ఎదుర్కోవాలో తెలిపే విధంగా మరియు చట్టాలు, శిక్షలపై ఈ సదస్సులో అవగాహన కల్పించామన్నారు. లైంగిక హింసకు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని చట్టాలపై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. హింస ఎదుర్కొనే వారికి మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.
మహిళా కమిషన్ మెంబర్ బూసి వినిత మాట్లాడుతూ హింసలు, బాల్య వివాహాలు అరికట్టడానికి మహిళలు, విద్యార్ధినులు చట్టాలను ఉపయోగించుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని సమస్యలను కొనితెచ్చుకోకూడదని విద్యార్ధినులకు సూచించారు..
మహిళా కమిషన్ మెంబర్ రుకియా భేగం మాట్లాడుతూ మహిళలు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అవసరమైతే సైబర్ విభాగం ఇస్తున్న అత్యవస నెంబర్ 1930 ను ఉపయోగించుకోవాలన్నారు. బాల్య వివాహాలను ప్రభుత్వం నిషేధించిందని, వాటిని ఎవ్వరూ ప్రోత్సహించరాదన్నారు. అదేవిధంగా ఆపదలో ఉన్న మహిళలకు 112 ను ఉపయోగించుకోవాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు ఆశ్రయం, వైద్య సదుపాయం, కౌన్సిలింగ్ లు వన్ స్టాప్ సెంటర్ల ద్వారా జరుగుతున్నాయన్నారు.
మేరిస్ స్టెల్లా కాలేజ్ ప్రిన్సిపాల్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొని అవగాహన పెంచుకుని హింసకు గురికాకుండా మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. ఏవైనా అనుకోని సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా కాలేజీ విద్యార్ధినులు పరిష్కరించుకోవాలన్నారు.
కృష్ణా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎన్. ఉష మాట్లాడుతూ మగవారితో సమానంగా హక్కులను అందిపుచ్చుకుని బాలికలు స్వయం శక్తిగా ఎదిగి తమను తాము నిరూపించుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, స్టేట్ మిషన్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్, సెర్ప్ ప్రతినిధి రాజేశ్వరి, వివిధ ఎన్జీవో ప్రతినిధులు సూయజ్, విద్యా కన్న, వివిధ మహిళా ప్రతినిధులు, తదితరలు పాల్గొన్నారు.