విజయవాడలో 86 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం

-మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు
-40 ఏళ్ల ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం – ఎంపీ కేశినేని చిన్ని
-విజయవాడ అభివృద్ధికి రూ.1,850 కోట్ల నిధులు తీసుకొస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని, నగరంలోని 86 డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గద్దె అనురాధ, బీజేపీ నాయకుడు షేక్ బాజీ, టిడిపి ఎన్నికల ఇంచార్జ్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎక్కడా రెబల్ అభ్యర్థులు లేకుండా ఇప్పటికే చాలావరకు చర్చలు జరిపామని, ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రంగా పోటీలో ఉన్నవారు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రెబల్ అభ్యర్థులుగా కొనసాగితే ఆయా పార్టీల నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

తమకు అందిన సర్వేల ప్రకారం విజయవాడలోని 86 డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు భారీ మెజారిటీ రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

40 ఏళ్ల ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపించామని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.

విజయవాడలో 26 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించి, రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చామని తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు శాశ్వత నివాస, యాజమాన్య హక్కులు కల్పిస్తూ పరిష్కారం చూపించామని వివరించారు.

40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించి, వారిని లక్షాధికారులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానిదేనని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.

విజయవాడ మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1,850 కోట్లు

విజయవాడ నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు సుమారు రూ.1,800 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద విజయవాడ ఎమ్మెల్యేలందరం సమావేశమై నగర అవసరాలను వివరించామని తెలిపారు. కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మేయర్‌గా ఎన్నిక కాబోతున్న వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సుమారు రూ.1,850 కోట్ల నిధులు తీసుకొచ్చి విజయవాడలో మంచినీటి సమస్యతో పాటు నగరంలోని ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

2014–2019 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కార్పొరేషన్‌కు అనేక నిధులు కేటాయించారని గుర్తుచేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కార్పొరేషన్‌పై సుమారు రూ.400 కోట్ల బకాయిల భారం పడిందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలవారీగా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్నామని, కొత్త కౌన్సిల్ ఏర్పడిన అనంతరం మిగిలిన బకాయిలను కూడా పూర్తిగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ చిన్ని తెలిపారు.

వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

వంగవీటి రాధాకృష్ణకు ప్రజల ఆశీర్వాదం ఉంది – ఎంపీ చిన్ని

విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూవిజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని, మొత్తం 86 డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయవాడ మేయర్‌గా బాధ్యతలు చేపట్టి నగర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం – బుద్దా వెంకన్న

టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయబోతున్నారని తెలిపారు. వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ మేయర్ అభ్యర్థిగా ఉండటం కూటమికి కలిసి వస్తోందన్నారు.

రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు లేకుండా నిజాయతీకి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ను అవినీతిమయం చేశారని విమర్శించారు.

వంగవీటి రాధాకృష్ణ తనదైన శైలిలో వినూత్న ఆలోచనలతో విజయవాడ కార్పొరేషన్‌లో సరికొత్త మార్పులు తీసుకొస్తారని, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు.

వంగవీటి రాధాకృష్ణ, మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రచార సమయంలో ఎదురుపడి మాట్లాడుకున్న విషయాన్ని కూడా వైసీపీ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజల అభిమానం పొందిన నాయకుడిగా రాధాకృష్ణకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, విజయవాడ మేయర్‌గా ఆయన తనదైన ముద్ర వేస్తారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

కూటమి పాలనకు స్థానిక ఎన్నికలు రెఫరెండం – గద్దె అనురాధ

టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు.

ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావిస్తున్నామని తెలిపారు. కూటమి పార్టీల మధ్య చిన్నపాటి సమస్యలు ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ అవినీతి రహిత నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని, నగరంలోని రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. విజయవాడలోని 86 డివిజన్లతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర నిధులతో విజయవాడ అభివృద్ధి – షేక్ బాజీ

బీజేపీ నాయకుడు షేక్ బాజీ మాట్లాడుతూకూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంకేతమే ఈ సమావేశమని పేర్కొన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణను గెలిపించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో విజయవాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

విజయవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలు తమ ఓటును వృథా చేసుకోకుండా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని షేక్ బాజీ కోరారు.

మొత్తంగా విజయవాడ నగరంలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి నాయకులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారని, కొత్త కౌన్సిల్ ద్వారా నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.