– సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
– జాతీయ సరస్ మేళాను సందర్శించండి
– లఖ్పతిదీదీల ఉత్పత్తులను ప్రోత్సహించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026 సందడి మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుందని, ఈ నెల 31వ తేదీతో మేళా ముగియనున్నందున ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఈ నెల 28న తాత్కాలికంగా మూతపడిన సరస్ గురువారం పునఃప్రారంభమైంది. దీంతో పెద్దఎత్తున సందర్శకులతో సరస్ ప్రాంగణం సరికొత్తగా కళకళలాడింది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సరస్ మేళాకు వచ్చి వివిధ రాష్ట్రాల లఖ్పతిదీదీల స్టాళ్లను సందర్శించారు. వారితో మాట్లాడి సరస్ వేదిక కల్పించిన అవకాశం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంతమేర అమ్మకాలు జరిగాయో, సందర్శకుల నుంచి స్పందన ఎలా ఉందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన విభిన్న ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు, సంప్రదాయ కళాకృతులు, గృహోపకరణాలు, వస్త్రాలు, ప్రాంతీయ ప్రత్యేకతలను చాటిచెప్పే ఉత్పత్తులతో సరస్ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల నుంచి లఖ్పతి దీదీలుగా ఎదిగిన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి కృషికి తగిన ప్రోత్సాహం అందించడంతోపాటు, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వావలంబనకు ప్రజలు తోడ్పడాలని పిలుపునిచ్చారు. చివరి రెండు రోజులపాటు ప్రత్యేక ఆఫర్లు, ఆకర్షణీయమైన ఉత్పత్తులతో సందర్శకులకు వైవిధ్యభరితమైన కొనుగోలు అనుభూతిని అందిస్తున్న జాతీయ సరస్ మేళాను ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా సరస్ మేళాకు విచ్చేసి, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు లఖ్పతి దీదీల విజయ ప్రస్థానంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) డైరెక్టర్ చక్రవర్తి, ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
