-రూ.9.86 కోట్ల విడుదల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు వ్యసన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 16 ప్రభుత్వాసుపత్రుల్లో నడిచే 16 మాదకద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రాలను రూ.9.86 కోట్లతో ఆధునికీకరించనుంది. మద్య నిషేధ, ఎక్సైజ్ శాఖ తాజాగా విడుదల చేసిన నిధులతో ఈ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. క్షేత్రస్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రధాన ప్రాంతీయ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య చికిత్స, పునరావాస సేవలు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కేంద్రాల్లో భవనాల మరమ్మతులు, గదుల విభజన, అద్దాల తలుపుల ఏర్పాటు, విద్యుత్ వ్యవస్థల బలోపేతం, ఆధునిక ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. బయో ఫీడ్‌బ్యాక్ యంత్రాలు, శ్వాస పరీక్ష పరికరాలు, మల్టీ పారామీటర్ మానిటర్లు, ఈసీజీ యంత్రాలతో పాటు డిజిటల్ సమాచార సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
వైద్య విద్యా శాఖ పరిధిలోని 10 ప్రభుత్వ బోధన, ప్రధాన ఆసుపత్రుల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, తిరుపతి ఎస్‌వీఆర్‌ఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిధిలోని మానసిక వైద్యశాలను ఈ కార్యక్రమంలో చేర్చారు. వీటిలో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి, కడప మానసిక వైద్యశాలను ప్రత్యేక వైద్య సేవల కేంద్రాలు(ఎక్స్‌లెన్సీ)గా అభివృద్ధి చేయనున్నారు. ఈ మూడు ప్రాంతీయ కేంద్రాల్లో అత్యున్నత వైద్య చికిత్స, వ్యసన విముక్తికి అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు, పునరావాస సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని కేంద్రాలు కూడా
వీటితో పాటు మరో ఆరు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోనూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి, నరసాపురం ఏరియా ఆసుపత్రి, నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లా ఆసుపత్రి, హిందూపురం జిల్లా ఆసుపత్రి, బాపట్ల ఏరియా ఆసుపత్రుల్లో భవన, విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ప్రాంతీయ, మారుమూల ప్రాంతాల్లోనూ వ్యసన విముక్తి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
